iDreamPost
iDreamPost
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో సేద్యంలో సాంకేతిక సాయం.. వరసగా రెండో ఏడు చెల్లింపులతో రైతుల మోములో విరిసిన చిరునవ్వులు ….
రాష్ట్ర వ్యాప్తంగా 10641 రైతు భరోసా కేంద్రాలతో తగ్గనున్న పెట్టుబడి వ్యయం , దక్కనున్న ఫలసాయం.
వైసీపీ మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి అతి ప్రధానమైన హామీలు రైతు భరోసా , గిట్టుబాటు ధరల స్థిరీకరణ నిధి . గత ప్రభుత్వ హయాంలో రుణ మాఫీ హామీతో మోసపోయి అప్పులపాలయ్యి కునారిల్లుతున్న రైతుల్ని ఆదుకోవటానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని , అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండవ ఏడాది నుండి ప్రతి ఏటా 12500 చొప్పున నాలుగేళ్లలో 50000 పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఏడు వరకూ ఆగకుండా మొదటి యాడాది నుండే ఈ పథకాన్ని అమలు చేయనారంభించారు .
ఈ క్రమంలో గత ఏడాది 46.69 లక్షల మంది రైతులకు మొదట ప్రకటించిన 12500 కి అదనంగా 1000 కలిపి 13500 మూడు విడతలుగా అందజేసిన వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం కరోనా కారణంగా ఉన్న ఇబ్బందికర పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బంది పడకూడదని వరసగా రెండో ఏడాది కూడా పధకం కొనసాగిస్తూ పెరిగిన లబ్దిదారులతో మొత్తం 49.43 వేల మంది లబ్ధిదారులకు ఏప్రిల్ నెలలో రెండు వేలు చొప్పున మొదటి విడత రైతుల ఖాతాల్లో జమ చేయగా ఈ రోజు రెండో విడత 5500 చొప్పున చెల్లించటం కోసం 2800 కోట్లు విడుదల చేసింది .
వివిధ సాంకేతిక కారణాల వలన గత ఏడాది పథకంలో నమోదు కాని వారు , కొత్తగా పాస్ బుక్స్ వచ్చిన రైతులు 2.74 లక్షల మంది రైతులు అదనంగా ఈ ఏడాది ఈ పధకం లబ్దిదారులుగా ఎంపిక అవ్వటం జరిగింది . కాగా ఈ పధకం తాలూకూ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో ఈ రోజే జమ చేయడం జరుగుతుందని అధికారులు చెప్పడం జరిగింది .
అలాగే లాక్ డౌన్ కారణంగా రవాణా , మార్కెటింగ్ సౌకర్యాలు లేక తమ పండ్ల , కూరగాయల ఉత్పత్తులకు ధర లభించక ఇక్కట్లపాలవుతున్న రైతుల్ని ఆదుకోవడం కోసం మార్చ్ 25 నుండి ఉద్యాన , మార్కెటింగ్ శాఖల ద్వారా రైతుల నుండి నేరుగా 3.5 లక్షల టన్నుల పండ్లని , 1.75 లక్షల టన్నుల కూరగాయల్ని ప్రభుత్వమే నేరుగా గిట్టుబాటు ధరల స్థిరీకరణ నిధుల ద్వారా కొనుగోలు చేసి పట్టణ ప్రాంత వినియోగదారులకు సరఫరా చేసింది .కాగా వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించని మరో పధకం వైయస్సార్ రైతు భరోసా కేంద్రం..
రైతుకి ప్రధానంగా అవసరమయ్యే విత్తనాలు , ఎరువులు , పురుగు మందులు మొదలైన వాటి కొనుగోలు విషయంలో కల్తీలతో , అధిక ధరలతో మోసపోకుండా గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10641 రైతు భరోసా కేంద్రాలను ఈ నెల 30 వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది .
ఈ కేంద్రం ద్వారా భూసార పరీక్ష , తదనుగుణంగా పంట సూచన , వ్యవసాయ శాఖ అధికారులు ద్వారా ఎరువులు , పురుగుమందులు , సస్యరక్షణ సూచనలు చేస్తారు . అలాగే ఎరువులు , విత్తనాల కల్తీ , నాణ్యతా పరీక్షలు స్థానికంగా నిర్వహించి రైతులకు అందించడం , మార్కెట్ ధరలు , మార్కెటింగ్ సదుపాయాల వివరాలు అందించడంతో బాటు , ఈ క్రాప్ నమోదుతో రుణ సదుపాయం సులభతరం చేయటం , మార్కెట్ లో గిట్టుబాటు ధర లభించని పక్షంలో ప్రభుత్వ ఈ కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే ప్రక్రియలు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా నిర్ణయిస్తారు .
రైతు పంట పండించే క్రమంలో తొలి అడుగు పెట్టుబడికి రైతు భరోసా ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ , పంట విత్తి ఎదిగే క్రమంలో కల్తీ అధిక ధరలతో మోసపోకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా సాంకేతిక సాయం చేస్తూ పంట ఇంటికి చేరాక సరైన ధర లభించకపోతే గిట్టుబాటు ధరల నిధి ద్వారా న్యాయం చేస్తూ రైతుకి ప్రతి దశలోనూ అండగా ఉంటున్న ఈ మూడు పథకాలు సక్రమంగా నిర్వహిస్తూ పోతే భావి కాలంలో వ్యవసాయం నిజంగానే పండగ అవుతుంది అనటంలో సందేహం లేదు .