Idream media
Idream media
ఇచ్చిన మాట ప్రకారం కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా సరే.. కాపుల సంక్షేమం కోసం సీఎం జగన్ ‘‘వైఎస్సార్ కాపు నేస్తం’’ పథకాన్ని ఈ రోజు ప్రారంభించారు. కాపుల్లో 45 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న మహిళలకు ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఐదేళ్ల పాటు 75 వేల రూపాయలను అర్హులైన కాపు మహిళలకు ప్రభుత్వం అందజేస్తుంది.
మొదటిసారిగా రాష్ట్రంలో 2.36 లక్షల మంది కాపు మహిళలకు దాదాపు 354 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ పథకాన్ని ఈ రోజు ప్రారంభించిన సీఎం జగన్ పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని సీఎం జగన్ స్పష్టం చేశారు. అర్హులైన కాపు మహిళలకు ఏటా 15 వేల రూపాయల చొప్పన 5 ఏళ్లలో 75 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. అర్హత ఉండి జాబితాలో ఎవరి పేరు లేకపోయినా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు.
కాపులను గత ప్రభుత్వం ఏ విధంగా వంచించిందో సీఎం జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో ఏడాదికి కాపుల సంక్షేమం కోసం 400 కోట్ల రూపాయలు కూడా కేటాయించని పరిస్థితులున్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 13 నెలల కాలంలోనే కాపుల సంక్షేమం కోసం 4,700 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చామని తెలిపారు.