iDreamPost
iDreamPost
వైఎస్సార్‌సీపీ దూకుడు పెంచింది. ఎన్నడూలేని విధంగా అమలుచేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించాలని సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీకి దిశానిర్దేశం చేశారు. విభజనకు ముందు, ఆ తర్వాత టీడీపీ హయాంలో సామాజిక అన్యాయం ఎలా జరిగింది? మూడేళ్లుగా ప్రభుత్వం ఆచరిస్తున్న సామాజిక న్యాయాన్ని జనం ముందుకుతీసుకెళ్లేలా ఈనెల 26 నుంచి 29 వరకూ బస్సు యాత్రను చేపడుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు యాత్ర బస్సు యాత్ర చేయనున్నారు. ఈ యాత్రకు పెట్టిన పేరు సామాజిక భేరి.
సామాజిక భేరి బస్సు యాత్ర ఈనెల 26న ఉత్తరాంధ్రలో ప్రారంభమై నగరాలు, పట్టణాలు, ప్రాంతాల మీదుగా సాగుతూ 29వ తేదీన అనంతపురం చేరుకుని, అక్కడే ముగుస్తుంది. యాత్రలో నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మే 30వ తేదీతో మూడేళ్లు పూర్తవుతున్నవేళ, సామాజిక న్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా బస్సు యాత్ర నిర్వహించాలన్నది సంకల్పం.
ప్రభుత్వం అమలుచేస్తున్న అమ్మ ఒడి, విద్యాకానుక, విద్యా దీవెన పథకాల లక్ష్యం భావి తరానికి ఉజ్వల భవిష్యత్తు. వైఎస్సార్ ఆసరా, చేయూత తదితర పథకాలతో ఆర్థిక స్వావలంబన. దామాషా ప్రకారం పదవులివ్వడం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు సామాజిక సాధికారత. చిత్తశుద్ధితో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరించాలని, ఆశీర్వాదం తీసుకోవాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు.
2019 జూన్ 8న 25 మందితో ఏర్పాటు చేసిన కేబినెట్ లో 14 పదవులు అంటే 56 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవే. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులకుగానూ నాలుగు ఆ వర్గాలకే. దేశంలో తొలిసారిగా హోంశాఖ మంత్రిగా ఎస్సీ మహిళను నియమించారు. శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ పదవులూ బీసీ, మైనార్టీ వర్గాలవే.
ఏప్రిల్ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఏకంగా 17 మంది అంటే 70 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే స్థానమిచ్చారు. ఇదికదా సామాజిక న్యాయమంటే.