భాగ్యనగరాన్ని కుదిపేస్తున్న వరుస అత్యాచార ఘటనలు.. మరో మైనర్ పై అత్యాచారం

హైదరాబాద్ నగరాన్ని వరుస అత్యాచార ఘటనలు తీవ్రఆందోళనకు గురిచేస్తున్నాయి. పసిపిల్లల నుంచి ఈడొచ్చిన ఆడపిల్లలను బయటికి పంపాలంటేనే తల్లిదండ్రులు జంకుతున్నారు. జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసు విచారణ జరుగుతుండగానే.. గడిచిన రెండ్రోజుల్లో నగరంలో నాలుగు అత్యాచార ఘటనలు వెలుగులోకి రావడం కలకలం రేపుతున్నాయి.

నింబోలి అడ్డకు చెందిన బాలిక (17) మల్లేపల్లి విజయ్ నగర్ కాలనీలోని ఓ హాస్టల్ లో ఉంటూ.. స్థానిక కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. హాస్టల్ కు సమీపంలో ఉన్న జిరాక్స్ షాపులో పనిచేసే సురేష్ (23) ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు ఒక ఫోన్ కొనిచ్చాడు. అప్పట్నుంచీ ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 9 గంటలకు బాలిక, తన స్నేహితురాలు కాలేజీకి వెళ్లొస్తామని చెప్పి బయటికొచ్చారు. తమ క్లాస్‌మేట్‌ రాహుల్‌ పుట్టిన రోజు వేడుక కోసం నెక్లెస్‌ రోడ్డుకు వెళ్లారు. రాహుల్ బర్త్ డే వేడుకకు రావాల్సిందిగా సురేష్ ను కూడా ఆహ్వానించడంతో.. అతను కూడా వెళ్లాడు.

అర్ధరాత్రి 12 గంటల సమయంలో అందరూ బర్త్‌ డే వేడుకల్లో నిమగ్నమై ఉండగా సురేష్ బాలికను పక్కకు పిలిచాడు. కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత హాస్టల్ కు వచ్చిన బాలిక.. కొద్దిరోజులకు అస్వస్థతకు గురైంది. హాస్టల్ సిబ్బంది ఏమైందని అడగ్గా.. అసలు విషయం బయటికొచ్చింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రమ్య.. సురేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. హుమయూన్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, సురేష్ పై ఐపీసీ 376 (2), సెక్షన్‌ 3 ఆర్‌/డబ్ల్యూ 4 పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. సంఘటన జరిగిన ప్రాంతం రాంగోపాల్‌పేట పరిధిలోకి రావడంతో హుమయూన్‌నగర్‌ పోలీసులు కేసును ఆ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. సోమవారం రాంగోపాల్ పేట పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

 

Show comments