Idream media
Idream media
మన భారతీయ రుషులు గడ్డాలు, మీసాలు పెంచుకుని (ఆ రోజుల్లో సెలూన్లు లేవు పాపం!) అడవుల్లో దోమలతో కుట్టించుకుని , చివరికి ఏదో ఒకటి చెప్పకపోతే బాగుండదని ఈ ప్రపంచం అంతా శూన్యం అని తేల్చేశారు. అంతటితో ఆగకుండా అంతా మాయ అని కూడా అన్నారు. ఈ లోకమంతా ఖాళీ అంటూనే , నీకు కనిపించేదంతా నిజం కాదు, భ్రాంతి అన్నారు.
ఎస్ బ్యాంకు దివాళా తీసింది. DHFL కంపెనీకి 9 వేల కోట్లు అప్పు ఇచ్చింది. అదేమో డబ్బులు లేవంది. ఈ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్ మంచివాడు. ముగ్గురు కూతుళ్లకి రూ.600 కోట్లు అప్పులిచ్చేశాడు. DHFL అప్పు వెనుక కూడా కపూర్‌కి బాగా ముట్టిందనే ప్రచారం ఉంది.
ఈ కపూర్ కోర్టులో చెప్పేందేమంటే తనకి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రాంతులు కలుగుతున్నాయి. అందువల్ల మానసిక వైద్యులతో చికిత్స చేయించుకుంటున్నానని అన్నాడు. నిజానికి బ్యాంకు ఖాతాదారులకి హెలూసినేషన్స్ కలుగుతున్నాయి. ఎన్ని లక్షల డిపాజిట్లు ఉన్నా రూ.50 వేలకి మించి ఖాతాలో డ్రా చేసుకోలేరు.
ఈ కపూర్ కూడా దేశం వదిలి పారిపోయేవాడే కానీ ఎందుకో కుదర్లేదు. నిజానికి ఒక్క కపూరే కాదు మనమంతా కూడా భ్రాంతిలోనే జీవిస్తున్నాం. రుషులు చెప్పకపోయినా మనకు తెలుసు.
ప్రజాస్వామ్యం ఉందని అంటారు కానీ, అదెలా ఉంటుందో ఎక్కడుంటుందో మనకు తెలియదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని నాయకులు పిలుపునిస్తూ ఉంటారు. ఇదో బ్రహ్మ పదార్థం. అంతుపట్టని భ్రాంతి.
ఇక సత్యం అనేది పెద్ద భ్రాంతి. ఎవరి సత్యం వాళ్లకు ఉంటుంది. సత్యమేవజయతే అంటే సత్యం జయిస్తుందని కాదు అర్థం. మనం జయిస్తే సత్యం జయించినట్టే అని.
విలువలు అని ఇంకో పదం ఉంది. ఇది భ్రాంతికి మించిన విభ్రాంతి, లేదా భ్రమ. విలువలకు కట్టుబడి ఉన్నామని నాయకులు అంటూ ఉంటారు. వాళ్ల ఆస్తుల విలువలు ఏటేటా పెరుగుతూ ఉంటాయి. ఏ పని చేయకుండా వందలు వేలకోట్లు సంపాదించేస్తూ ఉంటారు.
మనదేశంలో అందరికంటే ఎక్కువ భ్రాంతిలో జీవించేది కమ్యూనిస్టులు. కమ్యూనిజం ఈరోజో రేపో వచ్చేస్తుందని చెబుతూ ఉంటారు. అది ఎప్పటికీ రాదని మనకు తెలుసు, వాళ్లకే తెలియదు.
కరోనా వైరస్ కూడా ఒక భ్రాంతి అని ఒక స్వామీజి తేల్చబోయాడు కానీ, జలుబు చేసిన వెంటనే ఆస్పత్రిలో చేరింది ఆయనే.