iDreamPost
android-app
ios-app

రాజ్యసభలో టిడిపిని వెనక్కి నెట్టేసిన వైసిపి

రాజ్యసభలో టిడిపిని వెనక్కి నెట్టేసిన వైసిపి

పార్లమెంట్ ఉభయ సభల్లో తెలుగు రాష్ట్రాలకు పాతినిథ్యం‌ వహిస్తున్న పార్టీల్లో అత్యధిక ‌స్థానాలతో మొదటి స్థానంలో వైసిపి ఉంది. రెండో స్థానంలో టిఆర్ఎస్ ఉంది. తెలుగుదేశం పార్టీని వైసిపి వెనక్కి నెట్టేసింది. లోక్‌సభలో‌ 22 స్థానాలతో ముందు వరుసలో ఉన్న వైసిపి, కేవలం మూడు స్థానాలతో టిడిపి వెనుక వరుసలోకి‌ నెట్టబడింది. రాజ్యసభలో కూడా అదే జరిగింది. ఆరు స్థానాలతో వైసిపి ప్రధాన పార్టీల్లో ఒకటి కాగా, ఒకే ఒక స్థానంతో టిడిపి బ్యాక్ బెంచ్ కి పరిమితం అయింది.

తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ప్రాతినిద్యం లేకుండా పోయింది. అలాగే మొదటిసారి తెలుగుదేశం పార్టీ ఒక్క రాజ్యసభ సీటును కూడా గెలుచుకోలేదు.అంతేకాక సభలో కేవలం ఒక్కరికే టిడిపి పరిమితం అయింది. ఇంతకాలం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపిలుగా ఉన్న కెవిపి రామచంద్రరావు (తెలంగాణ నుంచి), సుబ్బరామిరెడ్డి, ఎం.ఎ ఖాన్ (ఆంధ్రప్రదేశ్)లు ఈ మార్చిలో పదవి విరమణ పొందారు.

ఈసారి అటు తెలంగాణలో కాని, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కాని ఒక్క కాంగ్రెస్ నేత కూడా రాజ్యసభకు ఎన్నిక కాలేకపోయారు. కాకపోతే కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి వచ్చిన మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి ఎంపి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు.తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు. అయినా ఫలితం లేదు.

ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే కనీసం 36 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఫలితంగా టిడిపి నామమాత్రపు పోటీకే పరిమితం అయింది.‌ ఏదో‌ పోటీ చేయాలని అభ్యర్థిని‌ బరిలోకి దింపింది. అయినా టిడిపి ఓట్లను పూర్తిగా వేయించుకోలేకపోయింది. ఇంతకుముందు ఎన్నికైన టిడిపి ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్ లు పార్టీ మారిపోయి బిజెపిలో చేరారు. సురేష్ ప్రభు అప్పట్లో ఎపి నుంచి ఎన్నికైనా ఆయన బిజెపివారే.తోట మహాలక్ష్మీ టిడిపి సభ్యురాలు పదవి విరమణ పొందారు. ఇక టిడిపికి మిగిలింది కనకమేడల రవీంద్రకుమార్ మాత్రమే.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానాల బలాబలాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న 11 రాజ్యసభ స్థానాలకు వైసిపి 6, బిజెపి 4, టిడిపి 1 స్థానాలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో ఉన్న 7 స్థానాలకు ఏడు టిఆర్ఎస్ చేతుల్లోనే ఉన్నాయి.