బాబు, యనమల వింటున్నారా..?

ఆంధప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు అధికార, పత్రిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికగా మారగా.. తాజాగా ఎన్నికల వాయిదా అంశం సవాళ్లకు దారితీస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీకి సవాళ్లు వస్తుంటాయి. కానీ చిత్రంగా ఏపీలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్షానికి సవాళ్లు వెళుతున్నాయి.

స్థానిక ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ అరాచకాలకు పాల్పడుతోందని, పోలీసులను ఉపయోగిస్తూ తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, అందుకే భారీ సంఖ్యలో ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పలు మార్లు ఆరోపించారు. సీఎం జగన్‌ లక్ష్యంగా పరుషపదజాలంతో విమర్శలూ చేశారు. చంద్రబాబు ఊహించని విధంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నుంచి సవాల్‌ వచ్చింది. తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా.. చంద్రబాబు, తన నియోజకవర్గ ప్రత్యర్థి, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణలను ఉద్దేశించి.. తుని మున్సిపాలిటిలోనూ, పంచాయతీలలోనూ ఒక్క స్థానంలో గెలవాలని రాజా సవాల్‌ చేశారు.

చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్‌ను తుని నియోజకవర్గంలోని ఏదైనా పంచాయతీలో పోటీ చేయించి గెలిపించుకునే దమ్ము ఉందా..? అంటూ రాజా ప్రశ్నించారు. రాజా సవాల్‌పై చంద్రబాబు స్పందిస్తారా..? అంటే లేదనే చెప్పాలి. ఆయన తరఫున బుద్ధా వెంకన్న, బొండా ఉమాలైనా ప్రతిసవాళ్లు విసిరాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు. తునిలో దాడిశెట్టి రాజా ప్రత్యర్థి, సీనియర్‌నేత అయిన యనమల రామకృష్ణుడు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Show comments