అయ్యో..యండమూరి కూడా ఇలాంటి పోస్టులు పెడుతున్నారే !!

సోషల్ మీడియా వ్యవహారాలు చాలామందిని చిక్కుల్లో నెడుతున్నాయి. కొందరు సెలబ్రిటీలను టార్గెట్ చేసిన ట్రోలింగ్ బృందాలు చెలరేగుతుంటే, మరికొందరు మాత్రం చేజేతులా తమ ఇమేజ్ ని చెడగొట్టుకుంటున్నారు. ఇక కరడుగట్టిన కార్యకర్తలయితే హద్దులు మీరుతూ ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు.

ఇక ఒక తరాన్ని తన రచనలతో ఉర్రూతలూగించిన యండమూరి వీరేంద్రనాథ్ కూడా అలాంటి ప్రయత్నమే చేసి అభాసుపాలయ్యారు. ఆఖరికి తన పోస్ట్ ని డిలీట్ చేసుకుని గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలామంది అభిమానం పొందిన ఆయన అంత సాధారణ స్థాయిలో ఎవరో రాసిన పోస్ట్ ని కాపీ పేస్ట్ చేసి దొరికిపోవడమే ఆశ్చర్యంగా మారింది. సీఏ విద్యను అభ్యసించి గతంలో బ్యాంక్ అధికారిగా కూడా పనిచేసిన యండమూరి ఓ చౌకబారు పోస్ట్ విషయంలో చాలామందిని విస్మయానికి గురిచేయడం చర్చకు దారితీసింది

దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కలిసి తమ వేతనాల్లో తలకు రూ.5 లక్షల చొప్పున ఇస్తే అది రెండు లక్షల నలభై ఐదు వేల కోట్లు అవుతుందని, దాంతో వలస కూలీలను ఆదుకుంటూ వ్యవస్థను ఆదుకోవడానికి ఉపయోగపడుతుందని ఆ పోస్టులో ఉంది. వాస్తవానికి ఇది యండమూరి సొంత పోస్ట్ కాదు. అప్పటికే వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. కానీ ఆయన పోస్ట్ చేస్తున్నప్పుడు అది వాట్సాప్ నుంచి సేకరించింది అనే విషయం గానీ, కాపీ పోస్ట్ అనే అంశం గానీ ప్రస్తావించలేదు. దాంతో ఆయన సొంతంగా సిద్ధం చేసిందనే అభిప్రాయం అసలు విషయం తెలియని తన అభిమానుల్లో కల్పించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. నిజానికి గతంలో కూడా యండమూరి నవలల్లోని వివిధ అంశాలు కూడా ఇతర భాషల పుస్తకాల నుంచి కాపీ చేసినవనే అంశంలో వివాదాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులో కూడా అదే పరంపరనా అనే అనుమానం కలుగుతోంది.

తీరా చూస్తే ఆ పోస్ట్ లో లెక్కల నిండా పూర్తిగా అసంబద్ధమే. అసలు దేశంలో 4,120 మంది రూ. 5లక్షలు ఇస్తే అది 2.45లక్షల కోట్లు ఎలా అవుతుందన్నది ఆయన కనీసం ఆలోచించలేదా అంటే లేదనే చెప్పాలి. ఆలోచిస్తే అది పూర్తిగా 250 కోట్లు కూడా కాదు. అలాంటి రెండన్నర లక్షల కోట్లు అవుతుందనే అంతుబట్టని లెక్కను ఎలా పోస్ట్ చేస్తారన్నది అర్థం అవుతుంది. ఇక ఎమ్మ్లెల్యేలు, ఎంపీల ఆదాయం 0.1 శాతం ఆదాయం రూ. 5లక్షలు ఎలా అవుందనేది కూడా ఎవరికీ తెలియని లెక్కలే. అంతేగాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే తమ ఆదాయంలో ఇవ్వాలనే లెక్క ఎందుకున్నది కూడా తెలియదు. అయినా యండమూరి వారు చేసిన పోస్ట్ అందరిలో సందేహాలు కలిగించింది. చివరకు ఆయన అభిమానులు కూడా ఆయనకు అసలు విషయం చెప్పాల్సి వచ్చింది. కొందరైతే మీరు కూడా ఇలాంటి పోస్టులు, కనీసం ఆలోచన లేకుండా ఎలా చేస్తారని నిలదీసినంత పనిచేయడంతో పాపం..యండమూరి తన తప్పిదాన్ని తెలుసుకుని పోస్ట్ డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది.

యండమూరి తన వాల్ మీద నేటికీ అనేక అంశాలతో యువతకు హితబోధలు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఇలాంటి అర్థ సత్యాలను పట్టుకుని ఎందుకు చేశారన్నది చాలామందిని ఆలోచింపజేస్తోంది. యండమూరి రాతల్లో ఇంత జారుడు ఏంటన్నది వారికి అంతుబట్టని అంశంగా మారుతోంది. ఇలాంటి పోస్టులతో ఉన్న సదాభిప్రాయం కూడా పోగొట్టుకుంటున్నారన్నది అనేక మంది అభిప్రాయం. 80వ దశకంలో అందరి నోటా వినిపించిన యండమూరి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు.సొంత రచనలతో ,ఇతరుల రచనలు కూడా షేర్ చేస్తున్నారు..షేర్ చేసే సందర్భంలో కొంత జాగర్తలు తీసుకుంటే మంచిది.

Show comments