యనమల, రాజప్పల అరెస్ట్ తప్పదా?

ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు రెండో పెళ్ళి విషయంలో ముదిరిన వివాదం చివరకు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప మెడకు చుట్టుకుంది. అందరికీ నీతులు చెప్పే యనమల స్వయంగా ఇరుక్కోవడంతో ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. స్వయంగా న్యాయవాది కూడా అయిన యనమల ఓ ఎస్సీ మహిళను మోసగించిన కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కొడుకు రెండో పెళ్లిన తన స్వగ్రామంలో ఏర్పాట్లు చేయడం, దానికి ఆయన హాజరుకావడంతో ఇక్కట్లు కొనితెచ్చుకున్నట్టుగా అయ్యింది. యనమలకు తోడుగా మాజీ హోం మంత్రి చినరాజప్ప కూడా ఆ వివాహానికి హాజరుకావడం ద్వారా రెండో పెళ్లి చేసుకుంటున్న తమ పార్టీ నాయకురాలి కొడుక్కి అండగా నిలవడంతో బాధితురాలు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు, వారి రెండో కుమారుడు, తనను మోసగించిన రాధాకృష్ణతో పాటుగా యనమల, రాజప్ప పై కూడా బాధితురాలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదయిన కేసులో తమను అరెస్ట్ నుంచి మినహాయించాలంటూ యనమల , రాజప్ప సహా పలువురు ఏపీ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. కేసు కొట్టివేయాలని కోరారు. కానీ కోర్ట్ దానికి నిరాకరిచండంతో వారు ఖంగుతినాల్సిన పరిస్థితి వచ్చింది. అరెస్టుల నుంచి మినహాయింపు విషయంలోనూ పిటీషనర్ల వాదనను అంగీకరించకపోవడంతో ఈ కీలక నేతలు ఇద్దరూ అరెస్ట్ కావాల్సిందేనా అనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి జైల్లో ఉండగా యనమల, రాజప్ప కూడా జైలు బాట పడితే టీడీపీ పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది.

కేసు విచారణను ఈనెల 23కి వాయిదా వేస్తూ మరిన్ని వివరాలు అందించాలని పోలీసులను కోర్ట్ ఆదేశించింది. అయితే ఈలోగా చట్టపరమైన చర్యలకు పూనుకుంటే మాత్రం ఈ మాజీ మంత్రులకు సమస్య తప్పదు. దాంతో వారు తీవ్రంగా మానసిక వేధనకు గురవుతున్నట్టు కనిపిస్తోంది. స్వతహాగా యనమల న్యాయపరమైన వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ ఈసారి చట్టప్రకారం చిక్కుకున్నారు. దాంతో ఆయన తీవ్రంగా సతమతం అవుతున్నట్టు సమాచారం. మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన అంత చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారని కూడా సన్నిహితులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఉదారంగా వ్యవహరిస్తారా, లేక ఓ అడుగు ముందుకేసి అరెస్టులకు సిద్ధపడతారా అన్నది చర్చనీయాంశం అవుతోంది.

మరోవైపు పిల్లి అనంతలక్ష్మి కోడలిగా చెప్పుకుంటున్న మంజు ప్రియ మాత్రం తనకు న్యాయం జరగాలని కోరుతోంది. ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు తగిన రీతిలో పరిహారం చెల్లించేందుకు కూడా ఓ ప్రయత్నం సాగినట్టు ప్రచారం సాగుతోంది. తమ మీద కేసు ఉపసంహరించుకుని, పెళ్లికి అభ్యంతరం పెట్టకపోతే ఆమెను అన్ని రకాలుగా ఆదుకుంటామని రాయబేరాలు పంపినట్టు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆమె దిగిరాకపోవడంతో టీడీపీ నేతల్లో దిగాలు పెరుగుతోంది. ఈ పరిణామాలు ఎటుదారితీస్తాయన్నది రాజకీయంగానూ ఆసక్తికరమే.

Show comments