Idream media
Idream media
ఎన్నికల కమిషనర్‌గా నిష్పాక్షికంగా, స్వతంత్రంగా విధులు నిర్వర్తించాల్సిన నిమ్మగడ్డ రమేశ్ మాజీ సీఎం చంద్రబాబుతో లాలూచీ పడి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, అందువల్ల ఆ వ్యక్తిని తిరిగి అదే పోస్టులో కొనసాగించాలంటూ ఉత్తర్వులు ఇవ్వరాదంటూ ఓ మాజీ సర్పంచ్ ఇటీవల హైకోర్టును కోరారు. టీడీపీకి అన్ని సందర్భాల్లో నిమ్మగడ్డ సహకరించిందుకే.. ఆయన కోసం టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు.
మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని 2018లో ఉమ్మడి హైకోర్టు ఆదేశాలిస్తే, వాటిని అమలు చేసేందుకు నిమ్మగడ్డ చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకుంటే ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించి ఆ మేర ఉత్తర్వులు పొందవచ్చునని సుప్రీంకోర్టు చెప్పినా కూడా, నిమ్మగడ్డ రమేశ్ ఆ పని చేయలేదని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో అప్పటి ప్రభుత్వ అలసత్వాన్ని ఆయన ప్రశ్నించలేదన్నారు.
ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా, వీఆర్ గూడెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ సువ్వారి పద్మావతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన వ్యాజ్యాన్ని వ్యతిరేకిస్తూ ఆమె హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. వర్ల రామయ్య వ్యాజ్యంలో తననూ ప్రతివాదిగా చేర్చుకుని, తన వాదనలూ వినాలని ఆమె కోర్టును కోరారు.
స్వతంత్రంగా విధులు నిర్వర్తించాల్సిన నిమ్మగడ్డ రమేశ్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని, ఇందుకు కారణం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆయన కుమార్తెకు ఏపీ ఎననామిక్ డెవలప్‌మెంట్ బోర్డులో స్థానం కల్పించడమేనని పద్మావతి కోర్టుకు వివరించారు.
ఎన్నికల కమిషన్‌ను ఓ రాజకీయ పార్టీకి మద్దతు తెలిపే కార్యాలయంగా మార్చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ అభీష్టం మేరకే ఆయన స్థానిక ఎన్నికలను వాయిదా వేశారని ఆమె తెలిపారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాలను నిరోధించి, అవినీతి అక్రమాలకు పాల్పడే వారికి జైలు శిక్షను విధించే ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కూడా నిమ్మగడ్డ రమేశ్ ప్రశ్నించారని పద్మావతి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగ పోస్టులో ఉండి ఈ విధంగా ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను ప్రశ్నించడం ఆయనకే చెల్లిందని ఆమె వివరించారు. నిమ్మగడ్డ రమేశ్ చర్యలను సమర్థిస్తూ తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు.