Idream media
Idream media
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో భారత్ మహిళా జట్టు,బంగ్లా మహిళల జట్టుపై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ గ్రూప్-A పట్టికలో 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.భారత్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టుకు శుభారంభం లభించలేదు.ఓపెనర్ షమిమా (3)ను రెండో ఓవర్ చివరి బంతికి శిఖ పాండే ఔట్ చేసి తొలి దెబ్బ తీసింది.మరో ఓపెనర్ ముర్షిదా,సంజిదా (10)తో కలిసి రెండో వికెట్ 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది.4 ఫోర్లతో 26 బంతులలో 30 పరుగులు చేసిన ముర్షిదా ఖాతూన్ అరుంధతి రెడ్డి బౌలింగ్ లో రిచా ఘోష్ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరింది.10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసిన బంగ్లా విజయ బాటలోనే నడుస్తున్నట్లు కనిపించింది.
మిడిల్ ఆర్డర్ ను దెబ్బతీసిన పూనమ్ యాదవ్:
ఈ దశలో వరస ఓవర్లలో అరుంధతి,పూనమ్‌లు సంజిదా(10),ఫర్గానా(0) హోక్ వికెట్లు పడగొట్టి బంగ్లా మిడిలార్డర్ వెన్ను విరిచారు.ఈ క్రమంలో వచ్చిన ఫాహిమా (17)తో కలిసి వికెట్ కీపర్ నిగర్ సుల్తానా రన్‌రేటు తగ్గకుండా ఆడుతూ లక్ష్యాన్ని అందుకునే ప్రయత్నం చేసింది. ఫాహిమా 13 బంతులలో 17 పరుగులు చేసి పూనమ్ యాదవ్ బౌలింగులో వర్మ చేతికి చిక్కి వెనుదిరిగింది.26 బంతులలో ఐదు ఫోర్లతో 35 పరుగులు సాధించిన నిగర్ సుల్తానా గైక్వాడ్ బౌలింగులో అరుంధతి రెడ్డి చేతికి చిక్కి పెవిలియన్ బాట పట్టింది.
స్లాగ్ ఓవర్లలో రాణించిన భారత బౌలర్లు:
20 బంతుల్లో 37 పరుగులు సాధించాల్సిన దశలో భారత బౌలర్లు తిరిగి పుంజుకొని కట్టుదిట్టమైన బంతులతో పొదుపుగా బౌలింగ్ చేసి బంగ్లా బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు.చివరి ఓవర్లలో జహారానా (10),రుమాన(13) విజయం కోసం పోరాడినా లాభం లేకపోయింది.నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే సాధించడంతో 18 పరుగుల తేడాతో టీమిండియా చేతిలో బంగ్లాదేశ్ ఓటమి చవి చూసింది.భారత ఉమెన్ బౌలర్లలో పూనమ్ యాదవ్ కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో మరోసారి కీలక పాత్ర పోషించింది.అరుంధతి రెడ్డి,శిఖ పాండే చెరో రెండు వికెట్లు పడగొట్టగా రాజేశ్వరి గైక్వాడ్ ఒక వికెట్ తీసింది.
రెచ్చిపోయిన ఓపెనర్ షెఫాలీ వర్మ:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు.రెగ్యులర్ ఓపెనర్ స్మృతి మంధాన మ్యాచ్‌కు దూరమవ్వడంతో తానియా భాటియా (2)తో కలిసి షెఫాలీ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. బంగ్లా బౌలర్లపై విరుచుకుపడి చుక్కలు చూపిన షెఫాలీ 17 బంతులలో 2 ఫోర్లు,4 సిక్సర్లతో 39 పరుగులు చేసిన షెఫాలీ వర్మ స్కోర్ బోర్డును ఉరుకులు పెట్టించింది. దూకుడుగా ఆడే క్రమంలో పన్నా ఘోశ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి షమిమా పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరింది.అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (8) విఫలమై నిరాశపరిచింది.
మిడిలార్డర్ లో వికెట్లు కాచుకున్న రోడ్రిగ్స్:
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దీప్తి శర్మ (11)తో కలిసి జెమిమా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడినప్పటికీ వేగంగా పరుగులు సాధించకపోవడంతో భారత స్కోర్ బోర్డుకు కళ్లెం పడింది.జెమిమా రోడ్రిగ్స్ 37 బంతులలో 2 ఫోర్లు,ఒక సిక్సర్ తో 34 పరుగులు చేసి రనౌట్ అయింది.ఆఖర్లో శిఖ పాండే (7 నాటౌట్)తో కలిసి వేదా కృష్ణమూర్తి 11బంతులలో నాలుగు ఫోర్లతో వేగంగా 20 పరుగులు సాధించి నాటౌట్ గా నిలవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు సాధించింది.
బంగ్లా ఉమెన్ బౌలర్లలో సల్మా ఖాతూన్,పన్నా ఘోష్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, మరో ఇద్దరు భారత బ్యాట్ ఉమెన్లు రనౌట్ అయ్యారు. కేవలం 17 బంతులలో 39 పరుగులు చేసిన షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.