సొంత గూటికి రాములమ్మ..?

సొంత గూటికి రాములమ్మ..?

సినీ నటి, కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి మళ్లీ పార్టీ మారుతున్నారనే ప్రచారం తెలంగాణలో ఊపందుకుంది. ఆమె కమలం గూటికి చేరబోతున్నారనే టాక్‌ నడుస్తోంది. రాజకీయ వర్గాల్లోనూ, మీడియాలోనూ విజయశాంతి పార్టీ మారడంపై సీరియన్‌ చర్చ సాగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరేలా విజయశాంతి ప్రకటనలు ఉన్నాయి.

ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్‌కు వర్తించే సమయం ఆసన్నమైందని విజయశాంతి పేర్కొన్నారు. ప్రలోభాలు, ఒత్తిళ్లు, భయపెట్టి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను బలహీన పరిచే ప్రక్రియ వల్ల మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరే స్థాయికి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌ కొంత ముందుగా వచ్చి ఉంటే పరిస్థితులు కొంత మెరుగ్గా ఉండేవికావచ్చన్నారు.

ఈ ప్రకటనతో విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిని బహిరంగంగా చెప్పారని అంటున్నారు. తద్వారా పార్టీకి భవిష్యత్‌ లేదని, టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగిందనే విషయం తన ప్రకటన ద్వారా తెలియజేశారు. బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్న తర్వాతనే విజయశాంతి ఇలాంటి ప్రకటన చేశారనే టాక్‌ నడుస్తోంది.

బీజేపీ అగ్రనాయతక్వం విజయశాంతిని పార్టీలోకి తిరిగి రప్పించేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు. ఇటీవల విజయశాంతితో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండుసార్లు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి కూడా ఒకసారి భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీలో రాములమ్మ పాత్ర, ప్రాధాన్యంపై చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాత ఆమె బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.

సినీ నటిగా విజయశాంతి తెలుగు ప్రజలకు సుపరిచితురాలు. రెండవ తరం అగ్రహీరోలందరి సరసన ఆమె నటించారు. ఓసేయ్‌ రాములమ్మ సినిమాలో.. రాములమ్మ పాత్ర చేయడంతో విజయశాంతి రాములమ్మగా పేరు గాంచారు. సినిమా జీవితం తర్వాత ఆమె రాజకీయ జీవితం బీజేపీతో మొదలైంది. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తల్లి తెలంగాణ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. కొన్నాళ్ల తర్వాత ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేసీఆర్‌తో విభేధాలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు బీజేపీలో చేరితే.. తిరిగి సొంత గూటికి విజయశాంతి వెళ్లినట్లుగా ఉంటుదని వ్యాఖ్యనిస్తున్నారు.

Show comments