iDreamPost
iDreamPost
జగన్ మరో సంచలనానికి తెరలేపబోతున్నట్టు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రివర్గం విషయంలో అనూహ్యంగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి ఈసారి ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశం అవుతోంది. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు విజయం సాధించి, బంపర్ మెజార్టీ సాధించిన తర్వాత తన క్యాబినెట్ సహచరుల ఎంపిక విషయంలో సీఎం తీరు ఆశ్చర్యకరంగా మారింది. అనేక మంది ఆశావాహులు, ముఖ్యంగా సీనియర్లను అసంతృప్తికి గురిచేసింది. అయినప్పటికీ ఆర్కే రోజా వంటి ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా తమ అసంతృప్తిని బయటకు వెళ్లడించకుండా జాగ్రత్తలు పాటించారు. ఇక ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు , వివిధ సామాజికవర్గాల కలయికగా ఉన్న మంత్రివర్గంలో అత్యధికుల పనితీరు నేటికీ గాడినపడలేదు. అయినప్పటికీ మంత్రులకు రెండున్నరేళ్ల సమయం ఇస్తున్నట్టు సీఎం తన తొలి సమావేశంలోనే ప్రకటించారు. ఆతర్వాత సమూల మార్పులతో క్యాబినెట్ లో మిగిలిన వారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు.
అనుకున్నవన్నీ జరగవన్నట్టుగా జగన్ కూడా తాను కోరి ఎంచుకున్న టీమ్ ఆశించిన మేరకు నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది ముఖ్యంగా పలువురు మంత్రులు సంబంధిత శాఖలో పట్టు సాధించలేకపోయారు. ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఢీకొట్టలేకపోతున్నారు. అటు సభలోనూ, ఇటూ సభ బయట కూడా ఈ పరిస్థితి కనిపిస్తోంది. స్వల్ప సంఖ్యలో ఉన్న విపక్షాన్ని ఢీకొట్టానికి అనేక సార్లు సీనియర్లు జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తన రెండున్నరేళ్ల గడువు కుదించడానికి సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. అందుకు తోడుగా మండలి రద్దు కూడా ముందుకొచ్చింది. త్వరలో శాసనమండలి రద్దయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో ప్రస్తుతం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులను అకామిడేట్ చేయాల్సి వస్తోంది.
ఈ పరిణామాలను గమనంలో ఉంచుకుని సీఎం స్థానిక ఎన్నికల ఫలితాలను ఓ కొలబద్ధగా పెట్టినట్టు ప్రచారం సాగుతోంది. రాజ్యసభ ఎన్నికలు, ఆ వెంటనే స్థానిక ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆయా మంత్రుల పనితీరుని పరిగణలోకి తీసుకుంటానని ఇప్పటికే స్పష్టం చేయడంలో అందులో భాగమే. నిజానికి సీఎం లోకల్ ఎన్నికల ఫలితాల పై మంత్రులకు టార్గెట్ విధించినట్టు కనిపిస్తున్నప్పటికీ దానికి మించి ఆయా మంత్రుల పనితీరుని పరీక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మంత్రులు కొందరు వారి శాఖ వ్యవహారాల్లో చురుగ్గా లేకపోవడం, అదే సమయంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దే చొరవ ప్రదర్శించకపోవడం సీఎం దృష్టిలో ఉన్నాయి. వాటిని మనసులో ఉంచుకున్న ముఖ్యమంత్రి స్థానిక ఎన్నికల ఫలితాల ఆధారంగా పదవుల విషయంలో పునరాలోచన ఉంటుందని ప్రకటించినట్టు కనిపిస్తోంది.
రాజ్యసభకు ఇద్దరు మంత్రులకు అవకాశం ఇవ్వబోతున్నట్టు సాగుతున్న ప్రచారం వాస్తవమయితే ఏప్రిల్ లో మంత్రివర్గంలో పెను మార్పులు తప్పవనే చెప్పవచ్చు. ఖాళీ అయిన బెర్త్ లు నింపడంతో పాటుగా సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు అనుగుణంగా కొందరిని సాగనంపే అవకాశాలు కూడా లేకపోలేదు. అదే సమయంలో కొందరి శాఖలను కుదించడం, అప్రధాన్య శాఖలకు పంపించడం వంటివి జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏమయినా జగన్ మనసులో మంత్రుల పరిస్థితి గురించి ఏమిటన్నది చాలామంది అమాత్యులకు అంతుబట్టడం లేదు. దాంతో కొందరు మంత్రులు కలవరపాటుకి గురవుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. చివరకు ఎవరి సీటు ఏమవుతుందన్నది వేచి చూడాల్సిన అంశం.