Idream media
Idream media
డబుల్ యాక్షన్‌తో నానీ శ్యామ్‌సింగరాయ్‌గా వస్తున్నాడు. గతంలో డబుల్ యాక్షన్ చేసిన కృష్ణార్జునయుద్ధం వర్కౌట్ కాలేదు. మేర్లపాక గాంధీ -నానీ కాంబినేషన్‌లో ఫుల్ కామెడీ వస్తుందనుకున్న ప్రేక్షకులకి, ఫుల్ యాక్షన్ వచ్చే సరికి డైజెస్ట్ కాలేదు. యుద్ధం వద్దు, కామెడీ కావాలన్నారు. తర్వాత నానీ రూట్ మార్చి దేవదాసు, గ్యాంగ్‌లీడర్ చేసినా అంతగా ప్రయోజనం లేదు. జెర్సీలో మాత్రం ఎమోషన్ పండింది. OTTలో వచ్చిన “వి”, టక్‌జగదీష్ కూడా పెద్దగా ఎక్కలేదు.
ఇప్పుడు భారీ బడ్జెట్‌తో శ్యామ్‌సింగరాయ్ వస్తున్నాడు. కలకత్తా నేపథ్యం, సాయిపల్లవి, కృతి అట్రాక్షన్, నానీ నటన ఇవన్నీ చూస్తే సినిమా బాగుండే అవకాశాలే వస్తున్నాయి. ట్రైలర్ చూస్తే గత జన్మ కథలా వుంది. ఒకప్పటి బెంగాల్ యువకుడికి, ఇప్పటి నానీకి లింక్ డైరెక్టర్ ఎలా సెట్ చేశాడో చూడాలి. కథలో దేవదాసి వ్యవస్థ కూడా ఉన్నట్టుంది. ఇప్పటి తరానికి తెలియని ఆ వ్యవస్థపైనే కథ వుంటే కొంచెం ఇబ్బందే.
తెలుగు సినిమాకి, బెంగాల్‌కి చాలా అనుబంధం ఉంది. దేవదాసు, మిస్సమ్మ, బాటసారి అన్నీ బెంగాలీ కథలే. బెంగాల్ సినిమాల నుంచి ప్రేరణ పొంది తీసిన మన డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు.
ఇక డబుల్ యాక్షన్ సినిమాల కిక్కే వేరు. మనిషిని పోలిన మనుషులు ఐదుగురు వుంటారు. దీని గాఢంగా నమ్మిన వాడు షేక్‌స్పియర్. కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఏకంగా ఇద్దరు డబుల్ రోల్. సంజీవ్‌కుమార్‌తో గుల్జార్ “అంగూర్” ఇదే కథతో తీశాడు. దీన్నే కన్నడలో తీస్తే హిట్. మన వాళ్లు కన్నడ రైట్స్ కొని తెలుగులో తీస్తే ప్లాప్.
మనకి బాగా ఫేమస్ రాముడు-భీముడు. NTRకి డూప్‌గా సత్యనారాయణ నటించాడు. చివరి గ్రూప్ ఫొటోలో NTRలా సత్యనారాయణ కనిపిస్తాడు. అప్పటికి ట్రిక్ ఫొటోగ్రఫీ డెవలప్ అయినట్టు లేదు. గండికోట రహస్యం, భలే తమ్ముడు సూపర్‌హిట్. విరాటపర్వంలో NTR ఐదు పాత్రలు వేస్తే నవరాత్రిలో ANR 9 వేశాడు.
దేవతలో సావిత్రి డబుల్ రోల్ వేస్తే, అదే కథని హీరోకి మారిస్తే శారద సినిమా. కుమారరాజాలో కృష్ణ త్రిబుల్ రోల్. ఒక కృష్ణని చూడడమే కష్టమైతే ఏకంగా 3 పాత్రలా అని వాపోయిన దురభిమానులున్నారు.
చిరంజీవి ముగ్గురు మొనగాళ్లలో త్రిబుల్ రోల్. కమల్‌హాసన్ అన్ని రికార్డులు దాటి దశావతారాలులో పది.
ప్రశాంతంగా చూసేంత వైవిధ్యం చూపగలిగితే ఒక నటుడు ఎన్ని రోల్స్ వేసినా మనకేం కష్టం?
Also Read : Bigg Boss 5 Winner Sunny : బిగ్‌బాస్‌లో సన్నీ విజయానికి కారణాలు