కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమైన షిరిడీలో కొలువైన సాయిబాబా ఆలయాన్ని మూసివేయనున్నారనే వదంతులతో భక్తుల్లో ఆందోళన మొదలయింది.
వివరాల్లోకి వెళితే సాయిబాబా జన్మస్థలం మహారాష్ట్ర పర్బనీ జిల్లాలో ఉన్న పథ్రి గ్రామమని భక్తుల నమ్మకం. కోట్లాది మంది భక్తులు సాయి జన్మ స్థలాన్ని కూడా దర్శిస్తూ తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. అయితే తాజాగా మహారాష్ట ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సాయిబాబా జనమ స్థలమైన పథ్రి గ్రామ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించడంతో వివాదం రాజుకుంది.
షిరిడి ఆలయ ప్రాముఖ్యతను తగ్గించడానికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పలువురు నాయకులు, భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో షిరిడి సంస్థాన్ ట్రస్ట్ రేపటినుండి ఆలయాన్ని నిరవధికంగా మూసివేయనుందని పుకార్లు వ్యాపించాయి. దీంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. షిరిడీ చుట్టుపక్కల 50 గ్రామాల సర్పంచ్ లు షిరిడీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరవధిక బంద్ పాటించాలన్న యోచనలో ఉన్నారని సమాచారం. ఆలయాన్ని కూడా మూసివేయమని అభ్యర్ధించినా దానికి షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ ఒప్పుకోలేదు.
ఆలయాన్ని తెరిచే ఉంచుతామని,దానితోపాటు కొన్ని అత్యవసర సేవలను అందుబాటులోనే ఉంచుతామని షిరిడి సంస్థాన్ ట్రస్ట్ స్పష్టం చేసింది. అత్యవసర సేవలు మినహా మిగిలిన కార్యక్రమాలను నిలిపివేయనున్నామని సంస్థాన్ ట్రస్ట్ స్పష్టం చేసింది. దీంతో అనేక సేవలు నిలిచిపోనున్నాయి.
ఉద్దవ్ ఠాక్రే చేసిన ప్రకటనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. షిరిడీ ఆలయ ప్రాముఖ్యతను తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. ఆలయాన్ని మూసివేయడం లేదని కొన్ని సేవలను మాత్రం అందుబాటులో ఉంచడం లేదన్న సంస్థాన్ ట్రస్ట్ ప్రకటనతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.మొత్తానికి ఉద్దవ్ ఠాక్రే చేసిన ప్రకటన ప్రస్తుతం మహారాష్ట్రలో వివాదాస్పదం అయ్యింది. కానీ ఈ వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో కాలమే సమాధానం చెబుతుంది.