iDreamPost
android-app
ios-app

బాబును మళ్లీ అక్కడ చూడబోతున్నామా..?

బాబును మళ్లీ అక్కడ చూడబోతున్నామా..?

రాజకీయాలు చేయడంలో దేశంలోనే చంద్రబాబుకు సాటిరాగ మరోక రాజకీయ నాయకుడు లేదని చెప్పేందుకు సందేహించాల్సిన పనిలేదు. చంద్రబాబు రాజకీయాన్ని గమనిస్తే ఆయన చేసే రాజకీయం ఏ పాటితో ఇట్టే అర్థం అవుతుంది. ప్రస్తుతం చర్చనీయాంశమైన సీఆర్‌డీఏ రద్దు బిల్లు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులు శాసన సభలో మళ్లీ ఆమోదం పొంది మండలికి చేరుకున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం మండలిలో ఈ రెండు బిల్లులు చర్చకు రానున్నాయి. ఈ సారైనా ఈ రెండు బిల్లులను ఆమోదించుకోవాలని అధికార పార్టీ, ఎలాగైనా సరే అడ్డుకోవాలని ప్రతిపక్ష టీడీపీ వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మరికొద్దిసేపట్లో ఈ వ్యవహారం తేలబోతోంది.

సీఆర్‌డీఏ బిల్లు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులు విషయంలో చంద్రబాబు ప్రవర్తించిన తీరు ఆయన రాజకీయం ఏ స్థాయిలో చేస్తారో చాటిచెప్పాయి. మీడియా, రాజకీయ పరిశీలకులను తనవైపునకు తిప్పుకునేలా చంద్రబాబు మండలి గత సమావేశాల్లో వ్యవహరించారు. ఫిబ్రవరిలో జరిగిన మండలి సమావేశాల్లో పై రెండు బిల్లులు సభ ముందుకు వచ్చిన సమయంలో చంద్రబాబు మండలి ప్రేక్షకుల గ్యాలరీలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా, జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పారని టీడీపీ శ్రేణులు చెప్పుకునే చంద్రబాబు మండలి గ్యాలరీలోకి రావడం చర్చనీయాంశమైంది. బాబు గ్యాలరీలో కూర్చుని బిల్లుల విషయంలో ఎలా వ్యవహరించాలో మండలిచైర్మన్‌కు నిర్థేశం చేశారని వైసీపీ నేతలు అప్పట్లో ఆరోపించారు. రూల్స్‌ ప్రకారం బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి పంపేలా లేవని, అయితే తన విచక్షణాధికారం మేరకు పంపుతున్నానని మండలి చైర్మన్‌ ప్రకటించడంతో అది వివాదాస్పదమైంది.

నాలుగు నెలల వ్యవధిలో మళ్లీ సీఆర్‌డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులు మండలి ముందుకు వచ్చాయి. నిన్న మంగళవారం శాసన సభ ఈ రెండు బిల్లులను ఆమోదించింది. మండలి ఆమోదమే తరువాయి. మండలిలో ప్రతిపక్ష టీడీపీకే సంఖ్యాబలం ఉంది. ఆ రెండు బిల్లులను అడ్డుకుంటామని టీడీపీ, అడ్డుకుంటే ఆమోదం పొందినట్లేనని అధికార వైసీపీ సభ్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల నడుమ మండలిలో ఏం జరగబోతోందనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమ పంతం నెగ్గించుకునేందుకు మళ్లీ చంద్రబాబు మండలి గ్యాలరీలోకి వస్తారా..? గతంలో మాదిరిగా గ్యాలరీ నుంచే తమ పార్టీ సభ్యులకు, మండలి చైర్మన్‌కు దిశానిర్ధేశం చేస్తారా..? లేదా..? చూడాలి.