iDreamPost
android-app
ios-app

మహిళా క్రికెట్ మహాసంగ్రామం రేపే… హర్మన్‌ సేన విశ్వవిజేతగా అవతరించేనా???

మహిళా క్రికెట్ మహాసంగ్రామం రేపే… హర్మన్‌ సేన విశ్వవిజేతగా అవతరించేనా???

రేపు మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే మహిళల టీ-20 ప్రపంచకప్ ఆఖరి పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్‌తో భారత్ తలపడనుంది.టీ-20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌లో ప్రవేశించిన భారత్,ఆరుసార్లు ఫైనలిస్ట్‌ అయిన ఆస్ట్రేలియాను ఢీకొన్న బోతుంది.గత ప్రపంచ కప్ పోటీలలో మూడు పర్యాయాలు సెమీ ఫైనల్‌తోనే సరిపెట్టుకున్న భారత్ నాలుగో ప్రయత్నంలో ఆఖరి పోరాటానికి అర్హత సాధించింది.2009లో జరిగిన మొదటి ప్రపంచ కప్ మినహా మిగిలిన ఆరు మహిళా టీ-20 ప్రపంచకప్‌లోనూ టైటిల్ కోసం బరిలో నిలిచిన ఆసీస్‌ నాలుగు సార్లు విశ్వవిజేతగా నిలిచింది.

ఇరు జట్లు తుది పోరుకు చేరిన క్రమం:

ఐసీసీ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓడినప్పటికీ తర్వాతి లీగ్ మ్యాచ్‌లలో వరసగా శ్రీలంక, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ జట్లపై గెలిచిన ఆసీస్,సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో నెగ్గి ఫైనల్‌లో అడుగెట్టింది.భారత్‌ గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు లీగ్‌ మ్యాచ్‌లను అజేయంగా ముగించి గ్రూప్-ఏలో అగ్ర స్థానం సంపాదించడంతో సెమీస్‌ వర్షార్పణం అయినప్పటికీ ఫైనల్ చేరింది.

ఆసీస్ బలం బ్యాటింగ్…భారత్ బలం బౌలింగ్:

ఆసీస్‌ ఉమెన్స్ బ్యాటింగ్‌ రాణింపుతో ఆస్ట్రేలియా టైటిల్‌ ఫేవరేట్‌గానే ప్రపంచకప్‌ బరిలో దిగింది.ఈ టోర్నీలో ఆసీస్‌ బ్యాటర్లలో నలుగురు బెత్‌ మూనీ (181), ఎలీసా హీలీ (161), మెగ్‌ లానింగ్‌ (116), రాచెల్‌ (102) వందకు పైగా పరుగులు సాధించడంతో బ్యాటింగ్ విభాగంలో ఆసీస్ పటిష్టంగా కనిపిస్తుంది. సొంతగడ్డపై ఆడుతుండడం ఆసీస్ జట్టుకు అదనపు బలం.

కంగారూల గడ్డపై ఓపెనర్‌ షెఫాలీ వర్మ(161) దూకుడుగా ఆడి శుభారంభం అందించడంతో పాటు మిడిల్ ఆర్డర్ లో జెమీమా రోడ్రిగ్స్‌(85) బాధ్యతాయుత ఆడుతుంది. కానీ సీనియర్లు స్మృతి మంధాన,సారథి హర్మన్‌ప్రీత్‌, వేద కృష్ణమూర్తి మాత్రం తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయకపోవడం జట్టుకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.అయితే బౌలింగ్‌లో మాత్రం భారత్‌ పటిష్ఠంగా ఉంది. స్పిన్నర్ పూనమ్‌ యాదవ్‌ (9 వికెట్లు),జట్టులోని ఏకైక ఫేస్ బౌలర్ శిఖా పాండే (7) కీలక సమయాలలో వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి తోడ్పాటు అందిస్తున్నారు.మరోవైపు ఆసీస్‌ బౌలర్లు మెగాన్‌ షట్‌ (9), జొనాసెన్‌ (7) బౌలింగ్‌లో రాణిస్తున్నారు.

ఐసీసీ నాకౌట్ దశలో తిరుగులేని విజయాలు ఆసీస్‌ సొంతం:

ఐసీసీ ప్రపంచకప్‌(వన్డే, టీ20)లలో నాకౌట్‌ దశలో 23 మ్యాచులు ఆడిన ఆస్ట్రేలియా 21 సార్లు విజయం సాధించింది.ఇంకా భారత్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల రికార్డులను పరిశీలిస్తే ఆడిన 10 మ్యాచ్‌లలో ఒకటి వర్షం కారణంగా రద్దు కాగా మూడింటిలో గెలుపొందింది

ఆస్ట్రేలియా,భారత్ జట్ల మధ్య జరిగిన 19 టీ20 మ్యాచ్‌లలో భారత్ కేవలం 6 మ్యాచులు మాత్రమే విజయం సాధించి 13 మ్యాచులు ఓడింది.అయితే చివరి రెండు ప్రపంచకప్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించిన రికార్డు భారత మహిళ జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో నాలుగు సార్లు తలపడ్డ ఇరుజట్లు చెరో రెండు విజయాలతో సమవుజ్జీగా ఉన్నాయి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు జరుగుతున్న ఫైనల్‌ గెలిచి కప్‌ను సగౌరవంగా అందుకొని తన బర్త్ డే గిఫ్ట్ ను సాధించాలని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కోరుకుంటుంది.