తెలంగాణ ప్రభుత్వంపై తెలుగుదేశం స్పందన కరువు.

  • Published - 03:26 PM, Wed - 6 May 20
తెలంగాణ ప్రభుత్వంపై తెలుగుదేశం స్పందన కరువు.

అయిదేళ్ల క్రితం అండమాన్ దీవుల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎక్కడో రెండు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది, నాలుగో ఐదో స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. మామూలుగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకోవడంలో దిట్టలు. ఇక అలాంటి వారు ఇలాంటి వార్తను వదులుతారా ? నడుం బిగించారు – “తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నట్టే” అంటూ ముఖ్యమంత్రి నుంచి ప్రతీ కార్యకర్త వరకు ముక్తకంఠంతో చెలరేగిపోయారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక తమది జాతీయ పార్టీ అని చెప్పుకోడం మొదలుపెట్టారు. ఇప్పటికీ వారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగానే చంద్రబాబు నాయుడు గారిని సంబోధిస్తుంటారు. ఎప్పుడు అవకాశం వచ్చినా చంద్రబాబు గారు దేశంలోనే తాను సీనియర్ అని, ప్రస్తుతం ఉన్న అందరి ముఖ్యమంత్రుల కన్నా తానే ముందు ముఖ్యమంత్రిని అయ్యానని కూడా చెప్పుకుంటూ ఉంటారు. మొన్న ఎన్నికల ముందు ఆ ప్రచారాన్ని ఏ విధంగా తారాస్థాయికి చేర్చారో అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల నుంచి అభిమానుల వరకు అలాగే అనుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదు. భ్రమల్లో నుంచి బయటకు రావడం వాళ్లకు ఎలాగూ ఇష్టముండదు కనుక ఎవరూ చేయగలిగిందేమీ లేదు.

కానీ ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే – తమది జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నప్పుడు, గత ఎన్నికల ప్రచారాల్లో బాబు గారు తన ప్రసంగాల్లో ప్రధాన మంత్రితో రకరకాల సవాళ్లు విసిరారు. అటు బాబు గారి అనుకూల మీడియా, ఇటు సామాజిక మాధ్యమాల్లోనో బాబు గారి భజన బృందాలు రెండూ “బాబు గారు హస్తినలో చక్రం తిప్పుతున్నారు”, “అధికార భారతీయ జనతా పార్టీని అష్టదిగ్బంధనం చేశారు” అంటూ చెలరేగిపోయారు. ఆ ప్రచారం కూడా సాధారణంగా వారు చేస్తుండేదే కనుక ఎవరూ ఏమీ చేయలేము. ఎన్నికల ఫలితాల తర్వాత అంచనాలు తారుమారవ్వడంతో కొంతకాలం మౌనంగా ఉండిపోయిన చంద్రబాబు ప్రస్తుతం జాతీయ పార్టీ అధ్యక్షుడు కాదు కదా, కనీసం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ పూర్తిగా లేదని చంద్రబాబు పరోక్షంగా అంగీకరిస్తున్నట్టు కనిపిస్తున్నారు. తెలంగాణలో టీఆరెస్ తప్ప ఇతర పార్టీలేవీ బలంగా లేకపోయినా నిజంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అడపాదడపా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, విమర్శిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే తమ పార్టీ దృష్టి పెట్టిందని, తెలంగాణా సమస్యల మీద తమ పార్టీ పోరాడలేదని, అందుకే తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చే పరిస్థితి లేదని టీవీ 9 కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పేశారు.

ఇకపోతే – తెలుగుదేశం పరిస్థితే ఎటూ కాకుండా పోయింది. ‘ఓటుకు నోటు కేసు’ సమయంలో అది మొత్తం తెలుగు వాళ్ళ కష్టంగా చిత్రీకరించారు. తెలంగాణలో ఉన్న ఆంద్ర వారికి ఏమైనా జరిగితే తాను సహించను అన్నారు, తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్రుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం అంటూ రెచ్చిపోయారు. ఇప్పుడివన్నీ – ఎందుకంటే దేశంలోనే సీనియర్ అనీ చెప్పుకునే చంద్రబాబు తన పరిధిని కేవలం పదమూడు జిల్లాలకు మాత్రమే స్వయంగా పరిమితం చేసుకుంటున్నట్టు స్పష్టంగా అర్ధమవుతోంది. ఎందుకంటే – గత నలభై రోజులుగా లాక్డౌన్ దేశవ్యాప్తంగా అమలులో ఉంది. ప్రపంచమే ఇంతవరకు ఇటువంటి సంక్షోభాన్ని చూడలేదు. నాలుగు గంటల్లో దేశం మొత్తం లాక్డౌన్ అని ప్రధాని ప్రకటించినప్పటి నుంచి దానిని అమలు చేయడంలో ప్రతీ చోట చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి, రకరకాల సవాళ్లు ప్రభుత్వాలకు ఎదురవుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అన్నిటినీ సరిదిద్దుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని అదుపులో ఉంచాయి. కానీ చంద్రబాబు గారి ధోరణి చూస్తే అదేదో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉన్నట్టు, వేరే ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేనట్టు పక్క రాష్ట్రంలో కూర్చుని దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే కేవలం దీనిని రాజకీయాలకు వాడుకునేందుకు దొరికిన గొప్ప అవకాశం లాగా భావిస్తున్నట్టు కనిపిస్తోంది.

దానికి తాజా ఉదాహరణ – కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాధికారం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం షాపులు తెరవాలని నిర్ణయించింది. ప్రతిపక్ష పార్టీ కనుక ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడం సహజమే కానీ దేశం మొత్తం ఒకే నిర్ణయం మీద కట్టుబడి ఉండాల్సిన సమయంలో ఇటువంటి కీలక విషయం మీద అలాంటి విధివిధానాలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వానిది కూడా తప్పుందని ఒక పార్టీ జాతీయ నాయకుడు, స్వయంప్రకటిత సీనియర్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా మాట మాత్రమైనా ఎందుకు అనలేకపోతున్నారు? ప్రధాని నరేంద్ర మోదీ తలుచుకుంటే కేసులు తిరగదోడి ఏమైనా చేయగలరని కోర్టుల్ని అవమానిస్తూ వేమూరి రాధాకృష్ణ లాంటి వారు రాసే రాతలకు చంద్రబాబు భయపడ్డారనే అనుకుందాం. సాటి తెలుగు రాష్ట్రం, ఆయన వచ్చే దాకా ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా పెద్దగా లేదని ఆయనే చెప్పుకున్న రాష్ట్రమైన తెలంగాణలో కూడా మద్యం అమ్మకాలు నేటి నుంచి ప్రారంభించారు కదా. ఇక్కడ రోడ్ల మీదకు వచ్చి తిరిగి వెళ్లే వాళ్ళ ఇక్కడ స్థిరపడ్డ ఆంధ్రుల క్షేమం కోసం చంద్రబాబు గారు ఏమి మాట్లాడరెందుకు ?

కాంగ్రెస్ పార్టీ నుంచి హనుమంతరావు గారి లాంటి వాళ్ళు కూడా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు – అదే కాంగ్రెస్ పార్టీతో కూడా చెట్టాపట్టాలేసుకుని తిరిగి, తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన చంద్రబాబు మాత్రం ఎందుకు పల్లెత్తు మాట అనట్లేదు. చంద్రబాబు గారికి తన కారణాలు, ప్రాధాన్యాలు, భయాలు ఏవైనా ఉండవచ్చు. కానీ తెలంగాణలో మిగిలిన అతికొద్ది మంది పార్టీ నాయకులు, కింది లెవల్లోని కార్యకర్తల మనోస్థైర్యార్యం మాత్రం దెబ్బతింటుంది. ఎందుకంటే ఇదే విషయం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద చెలరేగిపోయిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వారు సాటి తెలుగు రాష్ట్రంలో తీసుకున్న అలాంటి నిర్ణయం పైన ఏమీ మాట్లాడకుండా ఉండిపోతే మాత్రం … తెలంగాణాలో పార్టీ ఉనికి నామమాత్రానికే అని అంగీకరించినట్టే అవుతుందని అర్ధం చేసుకోవాలి. లేదంటే తెలుగుదేశం పార్టీ కేవలం పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని ఒప్పుకోవాలి.

Show comments