Idream media
Idream media
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. అత్యధిక పరీక్షలు చేయడంతోపాటు అతి తక్కువ ఇన్ఫెక్షన్ రేటు రికవరీ రేటు విషయంలో ఏపీ ఎంతో ముందుంది. ఇతర రాష్ర్టాలలో ఉన్న ఏపీ ప్రజలు తమ సొంత రాష్ట్రంలో ఉంటే బతికి పోవచ్చనే భావనలో వున్నారు. వలంటీర్ల సాయంతో కోవిడ్ సోకిన బాధితులను గుర్తించి, సరైన సమయంలో చికిత్స అందజేయడం ద్వారా ప్రాణాపాయం తప్పుతోంది.
3టీ వ్యూహంతో కట్టడి..!
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం 3టీ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ (మూడు టీలు–అనుమానితుల గుర్తింపు, పరీక్షలు చేయడం, తగిన చికిత్స అందించడం) విధానాన్ని పటిష్టంగా అమలు చేయడం ద్వారా బాధితులకు మెరుగైన వైద్యం అందించగలుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్లు, ఆశావర్కర్ల సాయంతో పలు దఫాలు సర్వేలు చేయడం ద్వారా కరోనా వైరస్ లక్షణాలున్న అనుమానితులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తోంది. పాజిటివ్ లక్షణాలున్న వారిని కోవిడ్ హాస్పిటల్స్‌కు తరలించి అత్యున్నతమైన వైద్యసాయంతో వేగంగా కోలుకునేలా చేస్తోంది.
అంతేకాదు.. వైరస్ సోకిన వ్యక్తితో నేరుగా సంబంధాలున్నవారిని, అతను కలిసిన వారిని సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కాంటాక్టు కేసులను వేగంగా గుర్తించి వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తోంది. 3టీ విధానం సత్ఫలితాలిస్తుండడంతో మిగిలిన రాష్ట్రాలూ ఏపీ నమూనాను అనుసరిస్తున్నాయి.
మొదటి వేవ్ కంటే రెండో వేవ్ వేగంగా విస్తరిస్తూ ఉండడంతో ప్రభుత్వం మళ్ళీ అప్రమత్తమైంది. గతంలో దేశ వ్యాప్తంగా రోజుకు లక్ష కేసులు నమోదైతే ఇప్పుడు రెండు లక్షలకు చేరాయి. గతంలో కోవిడ్ రోగులకు ఉచిత చికిత్సతో పాటు 14 రోజుల పాటు పౌష్టికాహారాన్ని అందించింది. కోలుకున్న వారికి రూ. 2 వేల ఆర్ధిక సాయం కూడా చేసింది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలతో పక్క రాష్ట్రం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి భారీగా ఏపీ ప్రజలు సొంత రాష్ట్రానికి క్యూ కట్టిన సంగతి తెలిసిందే.
అవే విధానాలు … ఇప్పుడు కూడా!
పెరుగుతున్న కేసుల నేపథ్యంలో సీఎం జగన్ వైద్యాధికారులతో గురువారం సమావేశమయ్యారు. వైరస్ విజృంభించకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు 6 లక్షల వ్యాక్సిన్లు ఇవ్వాలన్నది మన లక్ష్యం. దాన్ని సాధించాము. ఇక ముందు కూడా అలాగే చేయాలి. ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత ఉంది. దీనిపై కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.
Also Read : ఏపీ టాప్ : నిర్ధారణలోనే కాదు.. నివారణలో కూడా..!
గ్రీవెన్సుల కోసం 1902 నంబర్.!
గ్రీవెన్సుల కోసం 1902 నంబరు కేటాయించనున్నారు. ఇక 104 నంబరు కోవిడ్ సేవల కోసం పని చేయనుంది. కోవిడ్ పరీక్ష మొదలు.. వైద్యం, ఆస్పత్రులలో మెడిసిన్, శానిటేషన్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వరకు.. ప్రభుత్వం రాజీ పడట్లేదు. ఆస్పత్రిలో సేవలు, శానిటేషన్, నాణ్యమైన ఆహారం.. ఈ మూడు ప్రమాణాలు కోవిడ్ ఆస్పత్రులతో సహా, అన్ని ఆస్పత్రులలో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అన్ని ఆస్పత్రులను పరిశీలించడానికి గతంలో మాదిరిగా కొందరు అధికారులకు బాధ్యతలు అప్పగించింది.
టెస్టింగ్‌కు అధిక ప్రాముఖ్యత
రాష్ట్ర ప్రభుత్వం టెస్టింగ్ కు అధిక ప్రాముఖ్యతనిస్తోంది. గతంలో లాగే కోవిడ్ పేషెంట్ ప్రైమరీ కాంటాక్టులందరికీ పరీక్షలు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో కూడా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వ్యాక్సినేషన్‌పై కూడా దృష్టి సారించింది. రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది. ఇంట్లో ఉంటూ చికిత్స పొందే వారికోసం ఏడు రకాల ట్యాబ్లెట్లు, క్యాప్సల్స్‌తో కూడిన కోవిడ్ కిట్ అందించనున్నారు.
సరిపడ ఆక్సిజన్ సరఫరా.!
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా పూర్తి స్థాయిలో ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశాఖలో ప్రొడక్షన్ సెంటర్ నుంచి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అవసరమైన మేరకు అందుబాటులో ఉంచుకుంటున్నారు.
108 ఆస్పత్రుల్లో 15,669 బెడ్లు
రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.03 శాతంగా ఉంది. కోవిడ్ చికిత్స కోసం రాష్ట్రంలో 108 ఆస్పత్రులు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉండగా వాటిలో 15,669 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇప్పుడు 4,889 బెడ్లను పేషంట్లకు కేటాయించారు. 1,987 వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రోగి ఆస్పత్రికి వచ్చిన రెండు గంటల్లోనే బెడ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇలా, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజల్లో భయం తగ్గుతోంది. దేశంలోని ఏ రాష్ట్రం చేయని విధంగా కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో వ్యాప్తి మిగిలిన రాష్ట్రాల కంటే తక్కువగా ఉంది.