iDreamPost
android-app
ios-app

పోతిరెడ్డిపాడు విషయంలో విపక్షాల నోర్లు మూగపోయాయా .

  • Published May 14, 2020 | 2:49 PM Updated Updated May 14, 2020 | 2:49 PM
పోతిరెడ్డిపాడు విషయంలో విపక్షాల నోర్లు మూగపోయాయా .

పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 44 వేల క్యూసెక్కుల నుండి 80 వేల క్యూసెక్కులకు పెంచటానికి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన GO నెంబర్ 203 పై తెలంగాణా వ్యతిరేక గళం వినిపించి అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా , ఏపీ ప్రభుత్వం వృధాగా పోతున్న వరద జలాల్ని తక్కువ సమయంలో ఒడిసిపట్టి సీమకి మేలు చేకూర్చటానికి ఉద్దేశించిన జీవోనే తప్ప నికర జలాల వాటాలో నుండి తీసుకోవటానికి ఉద్దేశించినది కాదని కనుక తెలంగాణ ఆందోళన అర్ధరహితమని స్పష్టం చేస్తూ తెలంగాణా పిర్యాదు పట్ల నిరసన వ్యక్తం చేసింది . అలాగే సీమలోని పలువురు మేధావులు , నీటి పారుదల రంగ నిపుణులు , రైతులు తమ నిరసన గళం వినిపిస్తుండగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాత్రం విచిత్ర వాదన తెరపైకి తెచ్చారు .

కరోనా వైరస్ కట్టడి చేయలేక దాన్నుండి దృష్టి మరల్చడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఆడుతున్న నాటకం ఇది అని సూత్రీకరించారు చంద్రబాబు . దీంతో నివ్వెరబోవడం ఇరురాష్ట్రాల ప్రజల వంతు అయ్యింది . నవ్వులపాలవ్వడం బాబు వంతు అయ్యింది . సరే బాబు సిద్ధాంతాలు , రాజకీయం తెలిసే ప్రజలు పక్కన బెట్టారు అని వదిలేసినా పవన్ సహా మిగిలిన విపక్షాలు కూడా నోరు తెరవక పోవడం గర్హనీయం .

గతంలో పలుమార్లు సీమ పై కడప , పులివెందుల పై రౌడీలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ 19 ఎన్నికలకు ముందు తానూ సీమబిడ్డనే అని సూత్రీకరించుకొని కదిరిలో పోటీ చేస్తానన్నారు . అనంతపురం నుండే బరిలో నుంచుంటా అని తీర్మానించాడు . సరే ఎక్కడ నుంచున్నా ఫలితం ఏమైనా ఎన్నికల తర్వాత బీజేపీ ప్రతినిధి తరహాలో మత ప్రసంగాలు చేస్తూ సీమలో పర్యటించిన పవన్ సీమ పై అపార ప్రేమ కురిపిస్తూ సీమ చదువుల సరస్వతి కాగలదని అందుకోసం రైల్వేకోడూరులో భారీ గ్రంధాలయం కడతానని వాగ్దానం చేశారు . అలాగే ‘మన నది మన నుడి’ అనే కార్యక్రమం ప్రకటించి సీమ యువతని అక్కడి నీటి సమస్యలు చెబితే తాను తీర్చే ప్రయత్నం చేస్తానని వాగ్దానం చేసాడు . సీమ నాయకుల పొలాలు , సామాన్యుల పొలాలు పక్కపక్కనే ఉన్నా నాయకుల పొలానికి నీరు వస్తుంది , సామాన్యుల పొలానికి నీరు రావట్లేదు మీకు నేను న్యాయం చేస్తానన్నారు .

ఏమయ్యా పవన్ కళ్యానూ ఇన్ని చెప్పిన నీవు ఏనాడైనా సీమ వాసుల నీటి పోరాటానికి అండగా నిలుచున్నవా ? . పోనీ కనీసం ఒక ప్రాజెక్టు ప్రస్తావన చేసి అది ఫలానా దశలో ఉంది పూర్తి చేయండి అని ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చావా , ఒత్తిడి చేశావా? కనీసం ఇప్పుడైనా సీమ వాసుల నీటి కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంపుని తెలంగాణా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు .

పలు రాజకీయ ప్రసంగాల్లో కేసీఆర్ తాట తీస్తా అన్న నీవు సీమ ప్రజల కోసం తాట తీయకపోయినా వారికి సంఘీభావం ఎందుకు ప్రకటించవు . తెలంగాణా ధోరణిని ఎందుకు ఖండించవు . ఏపీ ప్రభుత్వానికి మద్దతు పలకకపోయినా ఒత్తిళ్లకు లొంగకుండా త్వరితగతిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంచండని ఎందుకు డిమాండ్ చేయవు . సీమ వాసుల పట్ల నీ ప్రేమ , ఆదరణ భాద్యత ఇదేనా , లేక గతంలో చెప్పిన మాటలన్నీ రాజకీయ పలుకులేనా ? . తెలంగాణా వాసిగా కేసీఆర్ కి ఎదురు మాట్లాడలేని చాతగానితనమా ?. ఇప్పటికైనా ఈ అంశం పై మీరు స్పందించని పక్షంలో పలు సీమ పర్యటనల్లో మిమ్మల్ని నమ్మి మీ వెనక తిరిగిన కొందరు యువకులు మీ పార్టీ కార్యకర్తలుగా కూడా చెప్పుకోలేక మొహం దాచుకొనే పరిస్థితి దాపురిస్తుంది వారికి .

ఇహ సీపీఐ రామకృష్ణ .. జన్మతః కర్నూల్ వాసి అయిన రామకృష్ణ , గతంలో అనంతపురం నుండి కూడా ప్రాతినిధ్యం వహించి గెలిచాడు కానీ ఏనాడు రాయలసీమ సమస్యల పట్ల సరైన స్పందన కనబరచని ఇతను బాబు గారి సమస్య తన సమస్యగా మాత్రమే కాక తన పార్టీ సమస్యగా శ్వీకరించి పలు ఆందోళనలు చేసి చివరికి సొంత పార్టీ కార్యకర్తలు ఇదేం పద్దతి అని నిరసన వ్యక్తం చేసినా పట్టించుకోని బాబు గారి అభిమాని .

అయ్యా రామకృష్ణ గారూ అమరావతి రాజధాని సమస్య బాబు సమస్య కాదు రాష్ట్ర సమస్య అంటూ వకాల్తా పుచ్చుకొని ఆందోళనలు చేసిన మీరు మిగతా సమయాల్లో సీమని పట్టించుకోకపోయినా ఈ క్లిష్ట సమయంలోనైనా సీమ రైతులకు సంఘీభావంగా స్పందించండి . మీ పార్టీ తెలంగాణా నేతలకి సైతం జీవో 203 పై అవగాహన కల్పించి తెలంగాణా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది . మరి స్పందిస్తారో లేక మిమ్మల్ని నమ్మి పగ్గాలు అప్పచెప్పిన పార్టీని సీమ నుండి కనుమరుగు చేస్తారో మీ ఇష్టం .

అన్ని పార్టీల కోస్తా నాయకులు కూడా ఈ సమస్య పట్ల స్పందించి రాయలసీమ ప్రాంత రైతులకు అండగా నిలబడాల్సిన సందర్భం ఇది . వృధాగా పోయే వరద జలాల కోసం ఉద్దేశించిన జీవోనే తప్ప నికర జలాల్లో ఏ హక్కుని కోరని ఈ అంశానికి మద్దతు పలకడం వలన కోస్తా ప్రాంత నీటి వాటాల్లో నష్టపోయేదేమీ లేదు కనుక రాష్ట్రంలో అంతర్భాగమైన సీమ రైతుల సమస్యని రాష్ట్ర సమస్యగా భావించి వారితో గళం కలిపి బలంగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది .