Idream media
Idream media
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో తన వ్యక్తిగత ఆసక్తి ఏమీ లేదని, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను మాత్రమే తాను నిర్వహిస్తున్నానంటూ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదు. సహేతుకంగా ఎన్నికలను నిర్వహిస్తున్నానంటూ చెప్పిన నిమ్మగడ్డ.. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. చేస్తున్న పని, తీసుకున్న నిర్ణయాలు సహేతుకమైతే.. నిమ్మలంగా కూర్చుని మీడియా అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నారనే సందేహాలు సాధారణంగానే వినిపిస్తాయి. కరోనా ఆందోళనతో ఉద్యోగులున్నా, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగిపోతుందని ప్రభుత్వం చెబుతున్నా.. పట్టించుకోని నిమ్మగడ్డ ఏ లక్ష్యంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారో స్పష్టంగా తెలుస్తోంది.
సహేతుకంగా లేదట..
వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎన్నిలకు సిద్ధం. ఇప్పుడు ఎన్నికలంటే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగిపోతుంది. ఇప్పటికే వేలాది మందిని కరోనా బలితీసుకుంది. ఎన్నికలు, వ్యాక్సినేషన్.. రెండూ ఒకేసారి నిర్వహించడం సాధ్యం కాదు. సుప్రిం కోర్టులో పిటిషన్ వేశాం.. సోమవారం వరకు ఆగండి.. అంటూ ఉద్యోగుల ఆందోళనను, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తెలపుతూ.. పంచాయతీ రాజ్ శాఖ అధికారులు రాతపూర్వకంగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు తెలియజేశారు. అయితే ఆ వినతి సహేతుకంగా లేదని నిమ్మగడ చెప్పుకొచ్చారు. నిమ్మగడ్డ వ్యవహార శైలి గమనిస్తున్న వారు.. ఈ వినతిని ఆయన పరిగణలోకి తీసుకోబోరని ముందే అంచనా వేశారు. దానికి తగినట్లుగానే ఈ రోజు నిమ్మగడ్డ తీరు ఉంది.
ఉద్యోగుల గోడు వినరా..?
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ప్రతి ఉద్యోగి దాదాపు వెయి మందిని కలవాల్సి ఉంటుంది. కేరళ స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత అక్కడ అధికారులు భారీ స్థాయిలో వైరస్ బారిన పడ్డారు. అందుకే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తాము సిద్ధమని ఉద్యోగులు ప్రకటిస్తున్నారు. ఇదే విషయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెలియజేసేందుకు యత్నిస్తున్నా.. వారికి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. తమ గోడు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదంటూ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వాపోతున్నారు. ఎన్నికలు నిర్వహించాల్సిన విధి, బాధ్యత ఉద్యోగులదేనంటున్న నిమ్మగడ్డ.. మరి వారి గోడును వినేందుకు ఎందుకు ఇష్టపడడంలేదు..? వారు చెప్పింది వినడం వల్ల వచ్చే నష్టం ఏమిటి..? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ తరహా తీరుతో వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ.. తాను సహేతుకంగా, నిష్పక్షపాతంగా పని చేస్తున్నానంటూ చెప్పే మాటలకు విశ్వసనీయత ఉంటుందా..? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.