Idream media
Idream media
అమరావతి రాజధాని ఉద్యమాన్ని ఢిల్లీలో నడిపించే బాధ్యతను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అప్పగించినట్లుగా ఉన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నుంచి జయదేవ్ లోక్‌సభ సమావేశాల్లో పాల్గొంటూ.. ఖాళీ దొరికినప్పుడల్లా కేంద్రంలోని ప్రముఖులను కలుస్తున్నారు. అమరావతి రాజధాని జేఏసీ ప్రతినిధులను వెంటబెట్టుకుని జాతీయ నేతలను కలుస్తూ రాజధాని ఉద్యమం గురించి వివరిస్తున్నారు. మూడు రాజధానులు ఏర్పాటు ప్రతిపాదన అడ్డుకోవాలంటూ వారిని కోరుతూ హస్తినలో హల్‌చల్ చేస్తున్నారు.
ఈ వారం రోజుల్లోనే జయదేవ్.. జేఏసీ ప్రతినిధులను వెంటబెట్టుకుని కొంతమంది కలవగా.. కొంత మంది వద్దకు కేవలం జేఏసీ ప్రతినిధులను మాత్రమే పంపుతున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలను జయదేవ్ కలిసి… అమరావతి ఉద్యమం గురించి వివరించారు. లోక్‌సభలో రాజధాని మార్పుపై జయదేవ్ అడిగిన ప్రశ్నకు.. రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశమంటూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చిన తర్వాత కూడా జయదేవ్ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.
కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానికి విరుద్ధంగా.. రాజధాని జాతీయ అంశం అంటూ మాట్లాడిన జయదేవ్.. ఆ తర్వాత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. తాజాగా నిన్న శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర ఉపరితల రావాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరినీ కలిసి అమరావతి ఉద్యమాన్ని గురించి వివరించారు.
ఢిల్లీలో జయదేవ్ అమరావతి పోరాట స్ఫూర్తిని మెచ్చుకోక తప్పుదు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అని చెప్పినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే అసలు కలవాల్సిన వారిని కాకుండా.. రాజధాని అంశంతో సంబంధంలేని మంత్రులను జయదేవ్ కలుస్తున్నారు. రాజధానిపై లోక్‌సభలో నిత్యానంద రాయ్ ప్రకటన చేయకముందు.. అమరావతి జేఏసీ ప్రతినిధులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని కలిశారు. ఈ సమయంలో జేఏసీ ప్రతినిధుల వెంట జయదేవ్ లేకపోవడం గమనార్హం.
ఇప్పుడు కూడా నితిన్ గడ్కారీ, దేశ ప్రధమ పౌరుడైన రాష్ట్రపతిని కలుస్తున్నారు గానీ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను మాత్రం కలవడంలేదు. రాజధాని అంశం పూర్తిగా కేంద్ర హోంశాఖ పరిధిలోనిదన్న విషయం జయదేవ్‌కు తెలియంది కాదు. అయినా ఆయన ఢిల్లీకి వచ్చిన అమరావతి ఉద్యమ జేఏసీ ప్రతినిధులను హోం శాఖ మంత్రి వద్దకు తప్పా… మిగతా వారి వద్దకు తీసుకెళుతున్నారు. ఇక్కడే జయదేవ్ చిత్తశుద్ధిని అమరావతి రైతులు, జేఏసీ ప్రతినిధులు శంకిస్తున్నారు. మరి జయదేవ్‌కు హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదా..? లేదా అమిత్‌షా వద్దకు జేఏసీ ప్రతినిధులను తీసుకెళ్లడం జయదేవ్‌కు ఇష్టం లేదా..? తీసుకెళితే ఢిల్లీ పోరాటానికి అంతటితో ఫుల్‌స్టాప్ పడుతుందని భావిస్తున్నారా..? జయదేవ్‌కే ఎరుక..!!