బూస్టర్‌ డోసు కొనుగోలు చేయాలా..?

కోవిడ్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసు విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఉత్పత్తి సంస్థలు వ్యవహరిస్తున్న తీరుతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసును ప్రైవేటుగా అందుబాటులో ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన వారు ప్రైవేటు కేంద్రాలలో వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసు తీసుకోవాలని సూచించింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు బూస్టర్‌ డోసు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు బూస్టర్‌డోసు ధరను కూడా నిర్ణయించింది. కోవిషీల్డ్‌ బూస్టర్‌ డోసు ధర 600 రూపాయలుగా, సర్వీస్‌ ఛార్జి 150 రూపాయలుగా నిర్ణయించింది. అదే విధంగా కోవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు ధర 1200 రూపాయలు, సర్వీస్‌ ఛార్జి 150 రూపాయలుగా నిర్థారించింది.

ధర తగ్గింపు వెనుక లక్ష్యం ఏమిటి..?

కోవిడ్‌ను ఎదుర్కొనే విషయంలో వ్యాక్సిన్‌ ఎంతగానో ఉపయోగపడింది. మొదటి, రెండు డోసులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజలకు ఉచితంగా అందించింది. అదే సమయంలో ప్రైవేటుగానూ అందుబాటులో ఉంచింది. కొనుగోలు చేయగలిగిన వారు ప్రైవేటు సెంటర్లలో వ్యాక్సిన్‌ తీసుకోగా.. అత్యధిక శాతం మంది ప్రభుత్వ వ్యాక్సిన్‌ సెంటర్లలోనే రెండు డోసులు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్‌ రూపంలో వచ్చిన కరోనా మూడో వేవ్‌ సమయంలో ప్రభుత్వాలు ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోసును అందించాయి. వైరస్‌ వ్యాప్తి తగ్గిన తర్వాత.. బూస్టర్‌ డోసు ఇచ్చే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.

అయితే కోవిడ్‌ వైరస్‌లలో కొత్త వేరియంట్లు పుడుతుండడం, ఇతర దేశాల్లో వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుండడంతో.. దేశంలో నాలుగో వేవ్‌ వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. నాలుగో వేవ్‌ను ఎదుర్కొనేందుకు అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో మాదిరిగా వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ వెంటనే అమలు చేస్తూ.. ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ప్రైవేటు వ్యాక్సిన్‌ కేంద్రాలలో అందుబాటులోకి తెచ్చింది. కోవిషీల్ట్‌ ధర సర్వీస్‌ ఛార్జిలతో కలిపి 750 రూపాయలు కాగా, కోవాగ్జిన్‌ ధర సర్వీస్‌ చార్జిలతో కలిపి 1350 రూపాయలుగా నిర్ణయించిన సర్కార్‌.. ఆ తర్వాత రెండు రోజులకే ఆ ధరను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఉత్పత్తి సంస్థల సూచన మేరకు ధరను తగ్గించింది. కోవిషీల్ట్, కోవాగ్జిన్‌ బూస్టర్‌ డోసుల ధర 225 రూపాయలు, సర్వీస్‌ ఛార్జిలు 150 రూపాయలుగా నిర్ణయించింది. వెరసి ఏ వ్యాక్సిన్‌ అయినా ప్రైవేటు సెంటర్లలో 375 రూపాయలకు లభించేలా విధానపరమైన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్‌ వచ్చిన కొత్తలో ధర తగ్గించేందుకు ససేమిరా ఒప్పుకోని ఉత్పత్తి సంస్థలు.. ఇప్పుడు తమకు తామే ధరను తగ్గించాలని కోరడం, కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవడంతో.. బూస్టర్‌ డోసును ప్రజలు కొనుగోలు చేయడం ద్వారా లబ్ది పొందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Show comments