iDreamPost
android-app
ios-app

వలంటీర్లు అంటే వణుకుతున్న బాబు..!

వలంటీర్లు అంటే వణుకుతున్న బాబు..!

ఇంటింటికి తిరిగేది అదొక ఉద్యోగమా..? మూటలు మోసేవాళ్లు, వాళ్లకు పిల్లనెవరైనా ఇస్తారా..?.. అంటూ వలంటీర్‌ వ్యవస్థపై, వలంటీర్లపై అవాకులు చవాకులు పేలిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారిని చూస్తేనే వణికిపోతున్నారు. నాడు చంద్రబాబు చులకన చేసిన వారే ఇప్పుడు ఆయనకు సింహస్వప్పంగా మారడం విశేషం. కాలం అన్నింటికీ సమాధానం చెబుతుందనేందుకు ఇదే గొప్ప నిదర్శనం. పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్లను భాగస్వాములను చేయొద్దంటూ చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఒక్క మాటతోనే వలంటీర్లు అంటే చంద్రబాబు ఏ స్థాయిలో భయపడుతున్నారో అర్థమవుతోంది.

ఎందుకు భయం..?

వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వలంటీర్లు పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యే, గ్రామ స్థాయి నేతలు.. ఇలా ఎవరి ప్రమేయం లేకుండానే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో వలంటీర్లదే కీలక పాత్ర. పైగా పార్టీలకు అతీతంగా అర్హతే ఆధారంగా ప్రజలకు పథకాలు అందుతున్నాయి. ఈ విషయంలో గతానికి, ప్రస్తుతానికి మధ్య వ్యత్యాసం ఏమిటో ప్రజలు, ముఖ్యంగా టీడీపీ సానుభూతిపరులు గుర్తించారు.

బాబు హాయంలో వైసీపీ సానుభూతిపరులంటూ వచ్చే పింఛన్లను కూడా తొలగించారు. జన్మభూమి కమిటీల ఆనుమతి లేనిదే అర్హులైన వృద్ధులకు పింఛన్‌ ఇచ్చే అధికారం కూడా కలెక్టర్లకు లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటిది జగన్‌ ప్రభుత్వం అర్హతే ఆధారంగా.. ఇంటి వద్దకే పథకాలు చేరవేస్తున్నారు. సీఎం లక్ష్యానికి అనుగుణంగా వలంటీర్లు పని చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించుకుంటే.. ఫలితం ఎలా ఉంటుందో చంద్రబాబుకు అర్థమైపోయింది.

బాబు నిలువరించగలరా..?

పథకాలు, ప్రభుత్వ సేవలే కాదు.. కరోనా విపత్త సమయంలోనూ వలంటీర్లు అందించిన సేవలు అమోఘమైనవి. కరోనా నియంత్రణలో వలంటీర్లదే కీలక పాత్ర. బాధితులను గుర్తించడం, దేశ, విదేశాల నుంచి వచ్చే వారి సమాచారం సేకరించడం, ఇళ్లలోనే చికిత్స తీసుకునే వారికి మందులు సరఫరా చేయడం.. ఇలా ప్రతి పనిలో వలంటీర్లను ప్రభుత్వం భాగస్వాములను చేసింది, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలోనూ వారి సేవలే కీలకం కానున్నాయి. వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం కూడా ఎన్నికల మాదిరిగానే చేపట్టాల్సి ఉందని ప్రభుత్వం ఇప్పటికే ఓ అంచానకు వచ్చింది. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ ఇవ్వబోతున్న తరుణంలో.. ఆయా వర్గాల వారిని గుర్తించి, వారికి స్లిప్పులు పంపిణీ చేసే బాధ్యతలు వలంటీర్లే నిర్వర్తించాల్సి ఉంది.

ఎన్నికల సమయంలో ఓటర్‌ స్లిప్పులను బూత్‌ లెవెల్‌ ఆఫీషర్‌ (బీఎల్‌వో) ఓటర్లకు పంపిణీ చేసేవారు. ఆ ప్రక్రియను వారు సమర్థవంతంగా నిర్వహించలేరని గత ఎన్నికలు చెబుతున్నాయి. రాజకీయ పార్టీల కార్యకర్తలే ఆ పని చేసేవారు. ఈ క్రమంలో ప్రలోభాలు జరిగేవి. ఈ సారి ఆ అవకాశం లేకుండా.. ఓటర్లకు స్లిప్పులు పంపిణీ వలంటీర్ల ద్వారానే జరగే అవకాశం ఉంది. ఫలితంగా ఓటర్లకు స్లిప్పులు అందడంతోపాటు.. వారిని ప్రలోభ పెట్టే అవకాశం అభ్యర్థులకు దక్కబోదు. ధనం, మద్యం ప్రభావాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చట్టం కూడా తెచ్చింది. ప్రభుత్వ లక్ష్యం అమలవ్వాలంటే వలంటీర్లే ఎన్నికల్లో పని చేయాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు వారి భాగస్వామ్యాన్ని అడ్డుకునేందుకు ఇప్పటి నుంచే ఎత్తులు వేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే.. బాబు అనుకున్నది జరిగే అవకాశం ఉంటుందనేది ఓ అంచనా.