Idream media
Idream media
మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుల మధ్య మొదలైన మాటల యుద్ధంతో.. ప్రస్తుతం కృష్ణా జిల్లా రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. కొడాలి నాని లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వరరావు మాత్రం ప్రస్తుతం ఎక్కడా కనిపించకపోవడం, వినిపించకపోవడంపై చర్చ సాగుతోంది. కొడాలి నానిపై బొండా ఉమా మహేశ్వరరావు ఒంటికాలిపై లేచేవారు. దేవినేని ఉమా, బొండా ఉమాలు ఇద్దరూ… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశారు. అసెంబ్లీలోనే కొడాలి నానిని బొండా ఉమా అసభ్యపదజాలంతో దూషించారు. పాతేస్తా.. నరికేస్తా.. అంటూ అసభ్యపదజాలంతో బొండా ఉమా విరుచుకుపడిన తీరు ఏపీ ప్రజలకు ఇప్పటికీ గుర్తుంది.
మాచర్ల ఘటనే మార్చిందా..?
ఇలాంటి తీరుతో ఉన్న బొండా ఉమా.. ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అవ్వడానికి కారణాలు ఏమిటంటూ ఆరా తీస్తున్నారు. అధికారం పోయి ప్రతిపక్షంలో కూర్చొవడంతోనే బొండా ఉమా తీరు మారిందా..? లేక మరేదైనా కారణం ఉందా..? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అనే సుమతి శతకాన్ని బొండా ఉమా ఆచరిస్తున్నట్లుగా ఉంది. టీడీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన బొండా.. 2019లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా కొంత కాలం యాక్టీవ్‌గా ఉన్నారు. గత ఏడాది మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లా మాచర్లకు వెళ్లారు. అక్కడ తమ పార్టీ వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని బొండా ఉమా, మరో టీడీపీ నేత బుద్ధా వెంకన్నలు మాచర్ల వెళ్లారు. అక్కడ తృటిలో దేహశుద్ధి నుంచి తప్పించుకున్నారు. అప్పటి నుంచి దేవినేని ఉమాలో ఫైర్ తగ్గిందంటున్నారు.
అప్పటి వరకు ఇంతేనా..?
ప్రభుత్వం, పాలకపార్టీ నేతలపై విమర్శలు చేయడమే కాదు.. టీడీపీ తరఫున ప్రెస్‌మీట్లు పెట్టడం కూడా బొండా ఉమా పూర్తిగా తగ్గించేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో తరచూ ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. సంక్షేమ పథకాల ప్రారంభంలోనూ వాటిపై విమర్శలు చేసేవారు. అయితే ప్రస్తుతం మునుపటి దూకుడును బొండా ఉమా పూర్తిగా తగ్గించేశారు. ఉండీ లేనట్లుగా అడపాదడపా కనిపిస్తున్నారు. దీంతో చంద్రబాబు మరో ఫైర్ బ్రాండ్‌ను తయారుచేసే పనిలో పడ్డారు. టీడీపీ అధికార ప్రతినిధిగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను బాబు ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ తరఫున ప్రభుత్వ నిర్ణయాలపై, సంక్షేమ పథకాలపై పట్టాభినే ప్రెస్‌మీట్లు పెట్టి విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలపై కూడా పట్టాభిరామే ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం మౌనాన్ని ఆశ్రయిస్తున్న బొండా ఉమా తీరు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది..? ఎన్నికలకు ముందు మళ్లీ యాక్టివ్ అవుతారా..? వేచి చూడాలి.