Idream media
Idream media
రాజ్యాంగబద్ధ సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాజకీయ నాయకుడు అవతారం ఎత్తారా..? అవుననేలా పరిణామాలు జరుగుతున్నాయి. జిల్లాల పర్యటనలు చేస్తూ, ప్రెస్‌మీట్లు పెడుతూ హల్‌చల్ చేస్తున్న నిమ్మగడ్డ వ్యవహారశైలి రాజకీయ నాయకుడుగా ఉందని ఇప్పటికే తేలింది. ఈ రోజు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించిన నిమ్మగడ్డ.. మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలతో ఆయన పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడు అవతారం ఎత్తారని స్పష్టమవుతోంది. వైఎస్సార్ కడప జిల్లాలో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్తావన తెచ్చిన నిమ్మగడ్డ.. వైఎస్సార్‌ను కొనియాడారు. వైఎస్‌ఆర్‌కు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందంటూ చెప్పుకొచ్చారు. తన ను ఫైనాన్స్ సెక్రటరీగా నియమించారని, ఆ తర్వాత రాజ్‌భవన్‌కు పంపారని, ఆయన ఆశీస్సుల వల్లనే ఎన్నికల కమిషనర్‌గా వచ్చానంటూ నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఇంతటితో ఆగని నిమ్మగడ్డ.. వైఎస్‌ఆర్‌లో లౌకిక దృక్ఫథం, రాజ్యాంగం పట్ల గొప్ప గౌరవం ఉండేదని, అధికారులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే వాతావరణం కల్పించేవారంటూ.. పొగడ్తల వర్షం కురిపించారు. నిమ్మగడ్డలో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పు వెనుకు ఆంతర్యమేమిటనే చర్చ సాగుతోంది.
కొడుకును తిట్టడం కోసమేనా..?
రాజు గారి పెద్ద భార్య మంచిది.. అన్న సామెత మాదిరిగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహారశైలి ఉంది. వైఎస్ జగన్‌ను దూషించేందుకు ఆయన తండ్రి వైఎస్సార్‌ను నిమ్మగడ్డ పొగుడుతున్నారని అర్థమవుతోంది. ఇప్పటి వరకు నిమ్మగడ్డ ఎలా వ్యవహారించారో అందరూ చూశారు. సీఎం వైఎస్ జగన్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా కేంద్రానికి లేఖ రాయడం, తాజాగా పంచాయతీ ఎన్నికల పేరుతో రాజకీయ నాయకుడి మాదిరిగా జిల్లాల పర్యటనలు చేస్తూ.. ప్రభుత్వం, అధికార పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న నిమ్మగడ్డ.. కడపకు వచ్చే సరికి తన పంథాను పూర్తిగా మార్చి వేయడం గమనార్హం. నిమ్మగడ్డ వ్యవహారిస్తున్న తీరును గమనిస్తున్న ఏపీ ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారు.
వారి ప్లాన్‌ను అమలు చేస్తున్నారా..?
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలలుగా చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియాగా పేరొందిన ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాథాకృష్ణ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై గతానికి భిన్నమైన శైలితో వ్యవహరిస్తున్నారు. వైఎస్ తాను రాజకీయ విరోధులమైనా.. తనకు గౌరవం ఇచ్చేవారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక రాథాకృష్ణ ప్రతి ఆదివారం రాసే కొత్తపలుకులో వైఎస్సార్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. వైఎస్‌ఆర్ పాలన గొప్పగా ఉండేదంటూ వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతున్నారు. వైఎస్‌ఆర్ మాదిరిగా జగన్ వ్యవహరించాలంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. వైఎస్‌ఆర్‌ను కీర్తిస్తూ.. వైఎస్ జగన్‌ను దూషిస్తున్న బాబు అండ్ కో ప్లాన్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బాబు ఏ స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారన్నది జగమెరిగిన సత్యం. ఇక టీడీపీ అనుకూల మీడియా నిత్యం వ్యతిరేక వార్తలు రాస్తూ వైఎస్‌ఆర్‌పై బురదజల్లిన విషయం మరచిపోలేనిది. ఇప్పుడు ఒక్కసారిగా వైఎస్‌ఆర్‌పై బాబు అండ్ కోకు గౌరవం ఏర్పడడం, పాలనపై ప్రశంసలు కురిపిస్తుండడం వెనుక లక్ష్యం ఏమిటో తెలిసిందే. బాబు అండ్ కో శైలినే అనుసరిస్తున్న నిమ్మగడ్డ.. వారి ప్లాన్‌ను ఎన్నికల కమిషనర్ హోదాలో ఉండి నిర భ్యంతరంగా అమలు చేస్తుండడంతో ఏపీ ప్రజలు అవాక్కవుతున్నారు.
దీని వల్ల ఉపయోగమేమి..?
ఎన్నికల కమిషనర్ హోదాలో ఉంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే రాజకీయ పార్టీల నేతలతోపాటు ప్రజలకు అర్థం అయింది. బాబు అంజెడాను నిమ్మగడ్డ అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైసీపీ శ్రేణులు కూడా నిమ్మగడ్డ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ను పొగడడం వల్ల నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఉపయోగం ఏమిటి..? అంటే.. నిమ్మగడ్డకు వైఎస్‌ఆర్ గొప్ప గుర్తింపు ఇచ్చారు, తన ప్రభుత్వంలో ముఖ్యమైన ఫైనాన్స్ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు.. వైఎస్ అలా చేస్తే.. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్.. నిమ్మగడ్డను ఇబ్బందిపెడుతున్నారని ప్రజలు అనుకోవడం కోసమే.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే.. అవన్నీ నిష్ప్రయోజనమే అవుతాయనడంలో సందేహం లేదు.