iDreamPost
android-app
ios-app

పోతిరెడ్డిపాడు వివాదం మీద తెలుగు బీజేపీ రాజ్యసభ సభ్యులు మాట్లాడరా?

  • Published May 18, 2020 | 6:13 AM Updated Updated May 18, 2020 | 6:13 AM
పోతిరెడ్డిపాడు వివాదం మీద  తెలుగు బీజేపీ రాజ్యసభ సభ్యులు మాట్లాడరా?

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని పెంచడానికి,కొత్త లిఫ్ట్ కట్టటానికి ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 203 జారీ చేసిన దరిమిలా తెలంగాణా ప్రతిపక్షాలు , ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించడం , ఇది కేవలం వృధాగా పోతున్న వరద జలాలను తక్కువ సమయంలో రాయలసీమకు తరలించి ప్రాజెక్ట్స్ నింపటానికి ఉద్దేశించినదే , నికర జలాల కేటాయింపుకి సంభందం లేదని దీన్ని అడ్డుకునే ప్రయత్నం సబబు కాదని వివరణ ఇవ్వడం జరిగింది.

కాగా తెలంగాణా బీజేపీ నేత , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఒకడుగు ముందుకు వేసి ఈ నిర్ణయం తెలంగాణాకు వ్యతిరేకమని దీన్ని అడ్డుకోమని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు . ఈ పిర్యాదుని పరిశీలిస్తామని కేంద్ర మంత్రిత్వ శాఖ సమాధానం ఇవ్వడం జరిగింది . టిఆర్ఎస్ కి కంచుకోట లాంటి కరీంనగర్ లోక్ సభ స్థానాన్ని గెలుచుకోవటంతో బండి సంజయ్లో ఆత్మవిశ్వాసం పాళ్లు పెరిగాయని చెప్పొచ్చు . గత మార్చిలో తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎన్నికైన తరువాత టిఆర్ఎస్ ని , కేసీఆర్ ఇరుకున పెట్టి తాను పై చేయి సాధించే లక్ష్యంతో గత కొంతకాలంగా బండి సంజయ్ దూకుడుగా వెళుతున్నాడు.

మరోవైపు చూస్తే ఏపీ బీజేపీ ఎంపీలు ఈ విషయంలో నోరుమెదపని పరిస్థితి . రాయలసీమకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలని , కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం తాను చావడానికైనా సిద్ధం అంటూ ఎన్నికల ముందు బీజేపీకి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష అంటూ కొన్ని రోజులు హడావుడి చేసిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత సీమ అభివృద్ధి కోసమంటూ బీజేపీలో చేరారు . ఆ తర్వాత కడప ఉక్కు కోసం వీరు కృషి చేసిందేమో కానీ ఆ ఊసు లేకపోగా , త్రాగు , సాగునీటి కోసం అర్రులు చాస్తున్న సీమ ప్రాంతానికి మేలు చేసే పోతిరెడ్డిపాడు సామర్ధ్య పెంపుకి మద్దతిచ్చే విషయంలో ఈ రోజువరకూ నోరు మెదపకుండా మొహం చాటేశారు .

Also Read:సీఎం జగన్ కు మద్దతు పలికిన బిటెక్ రవి.

అదే విధంగా అనునిత్యం సీమ అభివృద్దే తన ద్యేయం అంటూ పార్టీ ఫిరాయించిన ప్రతిసారీ సీమ అభివృద్ధి కోసం అని చెప్పుకునే టీజీ వెంకటేష్ నిన్న మీడియాతో మాట్లాడుతూ టిఆర్ఎస్ పై , కేసీఆర్ పై పలు వ్యాఖ్యలు చేశారు కానీ పోతిరెడ్డిపాడుకి మద్దతుగా తమ పార్టీ అధికారంలో ఉన్న కేంద్రాన్ని కోరే విషయం పై ఏమీ తేల్చకపోవడం విశేషం .

అలాగే టీడీపీ ఓటమి తర్వాత బీజేపీలోకి జంప్ అయిన మరో కీలక నేత, ప్రతి విషయంలోనూ బీజేపీ తరుపున రాష్ట్రంలో అనధికార పెత్తన కేంద్రం తానే అన్నట్టు వ్యవహరిస్తూ అమరావతి , ప్రాజెక్టులు లాంటి విషయాల్లో తన అభిప్రాయాన్నే బీజేపీ అభిప్రాయంగా చెలామణి చేయాలని ప్రయత్నించే సుజనా చౌదరి సీమ వాసులకు కీలకమైన పోతిరెడ్డిపాడు అంశం పై మాత్రం ఏ విధమైన అభిప్రాయం తెలియజేయలేదు . రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్నానని ప్రకటించిన వీరికి రాయలసీమ ప్రాంత నీటి కష్టాలు , పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు రాష్ట్ర సమస్యలుగా అనిపించలేదేమో .

గత పదేళ్లుగా బాబు గారికి కుడి ఎడమ భుజాలుగా , టీడీపీ పార్టీకి రెండు కళ్లుగా వ్యవహరించిన సుజనా చౌదరీ , సీఎం రమేష్ టీడీపీ ఓటమి తర్వాత చంద్రబాబును వీడి బీజేపీలోకి ఫిరాయించినప్పుడు రాష్ట్రం మొత్తం నివ్వెరపోయింది కానీ చంద్రబాబు వీరిని టీడీపీని వీడాకుండా అడ్డుకునే గట్టి ప్రయత్నం చేసినట్టు కనపడలేదు . మోడీ పై తీవ్ర వ్యాఖ్యల కారణంగా బీజేపీతో చెడిపోయిన సంబంధాల పునరుద్ధరణకు ,కేంద్రంలో తమ పనులు చక్కబెట్టుకోవటానికి చంద్రబాబు ప్రోద్బలంతోనే పార్టీ ఫిరాయించారని అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తాయి .

Also Read:పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచితే నిజంగా నష్టం జరుగుతుందా?

ప్రస్తుతం పోతిరెడ్డిపాడు అంశం పై తమ పార్టీ నేతలు ఎవరూ స్పందించవద్దని బాబు టీడీపీ నేతల్ని ఆదేశించగా అవే ఆదేశాలను బీజేపీలోకి ఫిరాయించిన టీజీ వెం కటేష్,సీఎం రమేష్ , సుజనా చౌదరి కూడా పాటిస్తూన్నారా అన్న అనుమానం కలగమానదు.
మరి ఈ అంశం పై కడప ఉక్కు సంకల్ప యోధుడు సీఎం రమేష్ ,రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పుకొనే సుజనా చౌదరీ , ప్రతిసారి సీమ కోసం అధికార పార్టీల్లోకి ఫిరాయించే టీజీ వెంకటేష్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి .

బండి సంజయ్ ఉత్తరం రాసినట్లు వీరు కూడా కేంద్రానికి లేఖ రాయాలి.. జగన్ తీసుకున్న నిర్ణయానికి కేంద్రం నుంచి అడ్డంకులు ఎదురు కాకుండా చూడాలి.