రష్యాలో లేని “పుష్ప”వికాసం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన ‘పుష్ప: ది రైజ్’ దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రంలోని డైలాగ్స్, సాంగ్స్, సీన్స్ గురించి ఏడాది దాటినా ఇప్పటికీ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు అంటే ఆ సినిమా ఎంతటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. అయితే గతేడాది ఇండియాతో పాటు యూఎస్ లోనూ బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచిన పుష్పరాజ్.. ఈ ఏడాది రష్యాలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు.

ఏకంగా ఏడాది తర్వాత ఈ డిసెంబర్ 8న రష్యాలో పుష్ప విడుదలైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్, హీరోయిన్ రష్మిక ఇలా మూవీ టీమ్ అంతా వెళ్ళి రష్యాలో ప్రచారం చేశారు. కానీ విడుదల తర్వాత రష్యాలో పుష్పరాజ్ హడావిడి గురించి ఎలాంటి వార్తలు లేవు. దానికి కారణం అక్కడ ఈ చిత్రం ఘోర పరాజయం పాలవ్వడమే అని తెలుస్తోంది. ఈ మూవీ బిజినెస్ కి, వచ్చిన కలెక్షన్స్ కి అసలు పొంతనే లేదని అంటున్నారు. కనీసం ఒక్క శాతం కూడా రికవరీ చేయలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రష్యాలో పుష్పరాజ్ ప్రభావం చూపలేక పోవడానికి ప్రధాన కారణం.. సరైన సమయంలో విడుదల కాకపోవడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పుష్ప ఇండియాలో విడుదలైన ఏడాది తర్వాత రష్యాలో విడుదలైంది. పైగా అక్కడ పరిస్థితులు ఇప్పుడు ఏమంత బాగాలేవు. చాలా కాలంగా ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం జరుగుతోంది. అది అక్కడి ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ పరిస్థితుల్లో అక్కడి ప్రజలు సినిమాలపై అంతగా ఆసక్తి చూపే అవకాశంలేదు. అక్కడి పరిస్థితిని సరిగ్గా అంచనా వేయకుండా.. రాంగ్ టైమ్ లో రిలీజ్ చేయడంతోనే పుష్ప చిత్రానికి అక్కడ కనీస ఆదరణ లభించలేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రష్యాకు బదులుగా జపాన్ లో విడుదల చేసినట్లయితే ఖచ్చితంగా చెప్పుకోదగ్గ కలెక్షన్లు వచ్చేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Show comments