iDreamPost
iDreamPost
ఏపీ క్యాబినెట్ లో మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. మండలి రద్దు ప్రక్రియ వీలయినంత వేగంగా పూర్తి చేయాలని వైసీపీ భావిస్తున్న తరుణంలో దానికి తగ్గట్టుగా పలు మార్పులు తప్పేలా లేవు. వెంటనే కానీ, లేదా ఆరు నెలల విరామం తో గానీ ఇద్దరు మంత్రులు క్యాబినెట్ నుంచి వైదొలగాల్సి ఉంటుంది. దాంతో మంత్రిమండలిలో ఏర్పడే రెండు ఖాళీల భర్తీ విషయంలో వైసీపీ నేతల మధ్య గుసగుసలు మొదలయ్యాయి. కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ మొదలయ్యింది. సామాజిక సమీకరణాల రీత్యా సమతూకం కోసం ఇద్దరు బీసీ మంత్రులు రాజీనామా చేసిన వెంటనే మరో ఇద్దరు బీసీ నేతలకు అవకాశం దక్కుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
కీలక శాఖలను నిర్వహిస్తున్న ఇద్దరు మంత్రులు వైదొలగాల్సి ఉండడంతో వారి స్థానాలను భర్తీ చేసేదెవరే ఊహాగానాలు మొదలయ్యాయి. రెవెన్యూ శాఖ చూస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉపముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. దాంతో ఆయన స్థానాన్ని అదే సామాజికవర్గం నుంచి భర్తీ చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. అదే జరిగితే తూర్పు గోదావరి జిల్లా నుంచి శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు ఉన్నారు. ఆయన పిల్లి బోస్ సొంత నియోజకవర్గం రామచంద్రాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో జెడ్పీ చైర్మన్ గా అనుభవం ఉన్నప్పటికీ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పటికే పలువురు కొత్త మంత్రులతో క్యాబినెట్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మరో కొత్త నేతకు అవకాశం దక్కుతుందా అనే అనుమానం వినిపిస్తోంది.
Read Also: రాజీనామా యోచనలో ఇద్దరు మంత్రులు
పిల్లి సుభాష్ చంద్రబోస్ పేరు త్వరలో జరుగుతన్న రాజ్యసభ రేసులో కూడా వినిపిస్తుంది. సీనియర్ నాయకుడు, పలుసార్లు మంత్రిగా పనిచేసిన పిల్లి సుభాష్ ను సామాజిక మరియు గోదావరి జిల్లాల సమీకరణాల దృష్ట్యా జగన్ రాజ్యసభకు ఎంపిక చేయవచ్చని వైసీపీ శ్రేణులలో చర్చ నడుస్తుంది.ఒక వేళ పిల్లి సుభాష్ ను రాజ్యసభ సీటు వరిస్తే చల్లబోయిన వేణుకు మంత్రి పదవి దక్కే అవకాశాలు తక్కువ.
అదే జరిగితే గౌడ సామాజికవర్గానికి చెందిన జోగి రమేష్ పేరు ప్రతిపాదనలోకి వస్తుందని చెప్పవచ్చు. ఆయన రెండోసారి కృష్ణా జిల్లా పెడన నుంచి విజయం సాధించారు. గత ఏడేళ్లుగా జగన్ వెంట ఉన్నారు. వాక్చాతుర్యం ఉన్న నేతగా గుర్తింపు ఉంది. దాంతో ఆయనకు బెర్త్ ఖరారు చేయవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ కృష్ణా జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ప్రాతినిద్యం వహిస్తున్నారు. పేర్ని నాని, కొడాలి నాని తో పాటుగా అదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మూడో మంత్రికి అవకాశం ఏమేరకు ఉందనేది ప్రశ్నార్థకమే. దాంతో పిల్లి బోస్ స్థానాన్ని ఎవరితో నింపుతారోననేది ఆసక్తిగా మారుతోంది.
Read Also: యనమల కూడా ప్రజాస్వామ్యం అంటున్నాడు
ఇక మోపిదేవి వెంకటరమణ వ్యవహారం కూడా చర్చనీయాంశమే. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మోపిదేవి ప్రస్తుతం పశుసంవర్థక, మార్కెటింగ్ వంటి శాఖలను నిర్వహిస్తున్నారు. ఆయన సీటు ఖాళీ అయితే సభలో ప్రస్తుతం ఇద్దరు మత్స్యకార ఎమ్మెల్యేలున్నారు. వారిలో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నాడ సతీష్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు తొలిసారిగా సభలో అడుగుపెట్టారు. దాంతో ఈ ఇద్దరిలో ఒకరికి అవకాశం ఖాయంగా చెప్పవచ్చు. ఏపీలో కీలక సామాజికవర్గం కావడం, 9 కోస్తా జిల్లాల్లోనూ ప్రాబల్యం ఉండడంతో వారికి బెర్త్ అనివార్యం అని చెబుతున్నారు. దాంతో ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటుగా మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ ఉన్న తరుణంలో మరొకరికి ఛాన్స్ దక్కుతుందా లేక తూర్పు గోదావరి నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో మత్స్యకార కోటా నింపుతారా అన్నది ఆసక్తికరం అంశం అవుతోంది. అప్పలరాజుకు ఒకింత మొగ్గు కనిపిస్తుంది. కానీ మోపిదేవి ఖాళీ చేసే సీటు కోసం గుంటూరు జిల్లా నుంచి పలువురు ఆశావాహులు ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు.
మొత్తంగా ఏపీ క్యాబినెట్ లో మార్పుల విషయం ప్రస్తుతానికి అవసరం ఉన్నట్టు కనిపించకపోయినప్పటికీ మంత్రులు వైదొలిగే పరిస్థితి వస్తే మాత్రం భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పవచ్చు. అది ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీయబోతోంది.