iDreamPost
iDreamPost
ఇటీవలే ప్రకటించిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా ఎఫెక్ట్ నేరుగా బెల్లంకొండ స్టువర్ట్ పురం దొంగ మీద పడింది. రెండూ ఒకే కథ కావడంతో ఎవరు ముందు పూర్తి చేస్తారా అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో మొదలయ్యింది. తమ దగ్గర చట్టపరమైన హక్కులు ఉన్నాయని ఆయన కుటుంబం దగ్గర అంగీకారం తీసుకున్నామని రవితేజ వెర్షన్ దర్శకుడు వంశీ చెబుతుండగా అలాంటిదేమి ఉండదని పబ్లిక్ల్ పర్సనాలిటీల కథలను ఎవరైనా తీసుకోవచ్చని బెల్లం హీరో అంటున్నాడట. మొత్తానికి ఇది వివాదంగా మారే అవకాశం ఉంది. అసలే ఇది దొంగ కథ. చరిత్ర గర్వంగా చెప్పుకునే మహనీయుడేమి కాదు. కాకపోతే తన ప్రాంత ప్రజలకు హీరో అంతే.
ఇప్పుడు ఎవరూ వెనక్కు తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఛత్రపతి హిందీ రీమేక్ అయ్యేవరకు తెలుగు సినిమాల గురించి ఆలోచించనని చెప్పిన సాయి శ్రీనివాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ లుక్ స్టువర్ట్ పురం దొంగ పోస్టర్లు వదలడం గమనార్హం. ఇది కేవలం రవితేజ టీమ్ కి కౌంటర్ ఇవ్వడానికేనని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కెఎస్ ఇంకా దీని గురించి బయట మాట్లాడలేదు. రెండు సినిమాలకూ టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. సీన్ టు సీన్ మక్కికి మక్కి ఉండకపోయినా కూడా కథ ఒకటే కాబట్టి పోలిక ఖచ్చితంగా వస్తుంది. ఇందులో ఫిలిం ఛాంబర్ జోక్యం సాధ్యం కాకపోతే వ్యవహారం కోర్టు మెట్ల దాకా వెళ్తుంది.
సాధారణంగా ఒక పబ్లిక్ ఫిగర్ కథను సినిమాగా తీస్తున్నప్పుడు సదరు ఫ్యామిలీ మెంబెర్స్ అంగీకారం తీసుకోవడం కనీస బాధ్యత, వంగవీటి, కొండా, ఎన్టీఆర్, తలైవి, సచిన్, ధోని, అజహరుద్దీన్, మేరీ కోమ్, పాన్ సింగ్ తోమర్ మొదలైన అన్ని సినిమాలకూ దీన్ని పాటించారు. వీళ్లంతా సమాజానికి స్ఫూర్తినిచ్చిన సెలబ్రిటీలు. కానీ టైగర్ నాగేశ్వరరావు కథ అది కాదు. రాబిన్ హుడ్ తరహాలో దొంగతనాలు చేసి జనానికి పంచాడు. ఇది మంచిదో చెడ్డదో పక్కన పెడితే చట్టవ్యతిరేకమైనది. కాబట్టి ఒకవేళ ఇది కోర్టు మెట్లు ఎక్కితే ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. మొత్తానికి ఒక దొంగ ఇద్దరు హీరోల కథ ఆసక్తికరంగా మారేలా ఉంది
Also Read : Indian 2 : కాజల్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు ?