iDreamPost
iDreamPost
IPLలో చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా ధోని ఎన్నో విజయాలని అందించాడు. నాలుగు సార్లు కప్పు కూడా గెలిచాడు. అయితే IPL 2022 సీజన్లో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ధోని వారసుడిగా రవీంద్ర జడేజాని ఎన్నుకొని అతన్ని కెప్టెన్ చేశారు. అయితే ఈ సీజన్లో చెన్నై సరైన ప్రదర్శన కనబర్చలేదు. దీంతో పాయింట్ల పట్టికలోచివరి నుంచి రెండో స్థానంలో ఉండి ప్లే ఆఫ్ ఆశలు కూడా లేకుండా చేసింది. అంతే కాక జడేజా ఆట పరంగా కూడా ఈ సీజన్లో ఆకట్టుకోలేకపోయి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాను అని ప్రకటించాడు.
దీంతో మరోసారి ధోనీనే చెన్నై పగ్గాలు తీసుకున్నాడు. అయితే వచ్చే సీజన్ లో మాత్రం అసలు ఆటలోనే ఉండను, ఇదే నా చివరి IPL అని ఇటీవల తెలిపాడు. ఒకవేళ ఉన్నా కోచ్ గానో, మెంటార్ గానో ఉంటాడు. జడేజా కూడా కెప్టెన్సీ తన వల్ల కాదని చేతులెత్తేయడంతో వచ్చే సీజన్ నుంచి చెన్నై కెప్టెన్ ఎవరా అని ఇప్పట్నుంచే చర్చ మొదలైంది. అయితే తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెన్నైకి కాబోయే కెప్టెన్ గా ఎవరైతే బాగుంటుందో అని ఓ సలహా ఇచ్చాడు.
చెన్నైకి వచ్చే సీజన్ నుంచి కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ అయితే బాగుంటుందని అన్నాడు సెహ్వాగ్. రుతురాజ్‌లో ధోని లక్షణాలు కనబడ్డాయని, ధోనిలాగే రుతురాజ్ కూడా కూల్ గా ఉంటాడని, రుతురాజ్ గతంలో మహారాష్ట్ర కెప్టెన్ గా కూడా పని చేసిన అనుభవం ఉందని, ఇవన్నీ చెన్నైకి గత వైభవం తీసుకొస్తాయని సెహ్వాగ్ అన్నాడు. మరి దీనికి ధోని, CSK యాజమాన్యం ఏమని స్పందిస్తుందో చూడాలి. మొత్తానికి వచ్చే సీజన్ చెన్నై కెప్టెన్సీ కోసం ఇప్పట్నుంచే చర్చలు మొదలయ్యాయి. ధోని తర్వాత అంతలా చెన్నై కోసం ఎవరు నిలబడతారో చూడాలి మరి.