Idream media
Idream media
మనం చాలా ఇంగ్లీష్ సినిమాలు చూశాం. ప్రపంచానికి కష్టం వచ్చినప్పుడు సూపర్ హీరోలు పుడతారు. సూపర్‌మ్యాన్ , స్పైడర్ మ్యాన్ , బ్యాట్‌మ్యాన్ ఇలా చాలా మంది ఉన్నారు. కానీ కరోనా కష్టంలో ఈ హీరోలు కూడా మాస్క్ వేసుకుని ఇంట్లో ఉండాల్సిందే.
తెలుగు హీరోలు కూడా చాలా సాహసాలు చేశారు. జగదేకవీరుడులో చిరంజీవి మాంత్రికుడిని ఎదురిస్తాడు. అంజిలో ప్రపంచాన్ని కాపాడుతాడు. నిన్నామొన్నావచ్చిన అఖిల్ కూడా తన మొదటి సినిమాలో లోకాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ పది మందిని కొట్టినా , రాంచరణ్ వంద మందిని మగధీరునిలా చంపినా అదంతా తెరపైనే.
రియల్ లైఫ్‌లో చిరంజీవి అయినా చేతులు కడుక్కోవాల్సిందే. ఎన్టీఆర్ కరోనాతో జాగ్రత్త అని చెప్పాల్సిందే. నాగార్జున పాట పాడాల్సిందే. మరీ రియల్ హీరోలు ఎవరు? డాక్టర్లు, నర్సులు , ఆశా వర్కర్లు ,వాలంటీర్లు, పోలీసులు, రోడ్లు ఊడ్చే కార్మికులు. వీళ్లు అసలు హీరోలు.
తమకి , తమ కుటుంబానికి ప్రమాదం అని తెలిసినా వీళ్లు పగలూ రాత్రి కరోనా నిర్మూలనకి పని చేస్తున్నారు. రేయింబవళ్లు యుద్ధం చేస్తున్నారు. పోలీసులైతే ఎర్రటి ఎండకి , వడగాలికి ట్రాఫిక్ జంక్షన్లలో కాపలా కాస్తున్నారు. ఎంత చేసినా వీళ్లని హీరోలుగా మనం గుర్తించం.
నటుల్ని అభిమానించవద్దని ఎవరూ చెప్పరు. మన జీవితంలో వాళ్లు వినోదాన్ని పంచుతున్నారు. కానీ వీళ్లు మనకి జీవితాన్నే ఇస్తున్నారు.
రేపు కరోనాకి ఒక డాక్టర్ వ్యాక్సిన్ కనిపెడితే అతని ఫొటోని మనం ఇంట్లో పెట్టుకుని పూజ చేయాలి. కానీ చేయం. అతని పేరు కూడా గుర్తు పెట్టుకోం.
పెన్సిలిన్ కనిపెట్టి కోట్లాది మంది మన తాతముత్తాతల్ని రక్షించింది ఎవరో మనకు తెలుసా? అతని జయంతి , లేదా వర్ధంతిని ఎపుడైనా జరుపుకున్నామా?
ఇది అంతే. కరోనా ముగిసిన తర్వాత సైన్స్ కంటే మనం పూజల్ని , యాగాల్నే ఎక్కువ నమ్ముతాం.