iDreamPost
android-app
ios-app

మూడో స్థానం వస్తే పరిస్థితి ఏంటంటావ్‌..

  • Published Nov 24, 2020 | 2:59 AM Updated Updated Nov 24, 2020 | 2:59 AM
మూడో స్థానం వస్తే పరిస్థితి ఏంటంటావ్‌..

యారోయ్‌ మణీ.. ఈ మధ్య ఎక్కడా కన్పించడం లేదు. పైగా మా ఇంటేపు కూడా రాడం లేదు.. ఏంట్రా విషయం అంటూ బండికి సైడ్‌ స్టాండ్‌ వేసి క్రిందికి దిగుతూ అడిగాడు కిట్టయ్య.

అప్పటికే పొలంలోని షెడ్డు అరుగు మీద కూర్చుని సెల్‌ఫోన్‌లో మెస్సేజ్‌లు చాలా సీరియస్‌గా చదివే పనిలో ఉన్నాడు మణి. సెల్‌ మీదనుంచి ముఖం పైకెత్తకుండానే.. ఏం లేదు బావా.. మొన్ననే కొత్త టచ్‌ సెల్‌ కొన్నాను బా. వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో బోలెడన్ని విషయాలు వచ్చేస్తున్నాయి బావా. వాటిని చూస్తూ కూర్చుంటే టైమ్‌ తెలియడం లేదు అన్నాడు సాగదీస్తూ మణి.

అది సరేరా ఏం మెస్సేజ్‌లు చదివేస్తున్నావేంటీ.. అంటూ మాట కలిపాడు కిట్టయ్య.

ఏం లేదుబావా.. మనం ఏదో అనుకుంటాం గానీ సోషల్‌ మీడియా చాలా స్పీడ్‌ బావా. ఇంకా నోటిఫికేషన్‌ కూడా రాని తిరుపతి ఉపఎన్నిక గురించి అప్పుడే చర్చపెట్టేస్తోంది ఇందులో.. అన్నాడు మణి.

ఏం చర్చ జరుగుతోందిరా అంటూ అడిగాడు కిట్టయ్య.

తిరుపతి ఉపఎన్నికలో అధికార వైఎస్సార్‌సీపీకే మొగ్గు ఎక్కువగా ఉంటుందట. ఇక రెండు, మూడు స్థానాల కోసం మిగతా పార్టీలు పోటీ పడతాయంటున్నారు బావా ఇందులో అన్నాడు మణి.

అంతే కదరా.. సాధారణంగా అధికార పార్టీకి ఉండే మొగ్గు ఎలాగూ ఉంటుంది. పైగా వైఎస్సార్‌సీపీ ఎంపీయే కదా మృతి చెందింది. అందువల్ల సింపతీ కూడా వర్కౌట్‌ అవుతుందన్న ఉద్దేశంలో అలా మెస్సేజ్‌లు వచ్చుంటాయిరా అంటూ వివరించాడు కిట్టయ్య.

అది సరే బావా.. రెండు, మూడు స్థానాల గొడవేంటంటావ్‌ అంటూ ఆసక్తిగా అడిగాడు మణి.

ఏం ఉందిరా.. గెల్చిన పార్టీకి, పోటీలో నిలిచిన పార్టీ అంటే సమీప ప్రత్యర్ధికి ఓట్లలో తేడా తక్కువ శాతమే ఉండొచ్చు రా మణీ. అదే మూడో స్థానంలోకి పడ్డొళ్ళకి మాత్రం భారీగానే తేడా ఉంటుంది. 2019 ఎన్నికల్లో కూడా తిరుపతిలో ఇదే విధంగా తేలింది. అంచేత ఒక వేళ తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ–జనసేనలు మూడో స్థానంలోకి వచ్చాయనుకో షరా మామూలే అనుకోవచ్చు. అదే టీడీపీ గనుక మూడో స్థానానికి చేరిందనుకో రాష్ట్రంలో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా పోగొట్టుకునే టైమ్‌ దగ్గరకొచ్చినట్టే రా మణీ అంటూ విషయం తేల్చేసాడు కిట్టయ్య.

అదేంటి బావా.. అలా తేల్చేసావ్‌.. అంటూ ఆశ్చర్యపోయాడు మణి.

అది నిజమే కదరా.. గత ఎన్నికల్లో నోటాతో పోటీ పడ్డ బీజేపీయే, ఒక్క సీటు తప్ప మరెక్కడా గెలవని జనసేనలు సంయుక్తంగా రెండో స్థానానికి వచ్చేసి, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ మూడో స్థానానికి వెళ్ళిపోతే ప్రజలు ఇప్పటి వరకు ఉన్న ఆ హోదాను కూడా తీసేసారనే కదరా అర్ధం.. అంటూ మణి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని తన సెల్‌లో మెస్సేజ్‌లు చూసుకునే పనిలోపడ్డాడు కిట్టయ్య.

దాంతో తన కొత్త టచ్‌ సెల్‌ పక్కన పెట్టేసి బుర్రగోక్కునే పనిలో పడ్డాడు మణి.