iDreamPost
android-app
ios-app

ఎరుపు ఓట్లు ఎవరికి మెరుపు!

ఎరుపు ఓట్లు ఎవరికి మెరుపు!

బెంగాల్ ఎన్నికలు బీజేపీ కు, అధికార తృణమూల్ కాంగ్రెస్ కు మధ్య పోటాపోటీగా సాగుతున్న సమయంలో అసలు బెంగాల్ ను మూడు దశాబ్దాలకు పైగా పరిపాలించిన సిపిఎం పార్టీ పరిస్థితి ఏమిటి? అసలు పోటీలో లేని లెఫ్ట్ పార్టీలు దేనికోసం ఆరాట పడుతున్నాయి? క్రమక్రమంగా దేశంలో ఉనికి కోల్పోతున్న కమ్యూనిస్టు పార్టీల ఓటుబ్యాంకు ఎటు పోతుంది? ఏ పార్టీల వైపు మళ్ళుతుంది అన్నది కీలకం. ముఖ్యంగా బెంగాల్లో ఒకప్పుడు బలంగా ఉండే వామపక్షాల ఓటుబ్యాంకు ఇప్పుడు ఏ పార్టీ కి వెళ్తుంది అనే లెక్కలు కాక పుట్టిస్తున్నాయి.

2011లో తృణముల్ కాంగ్రెస్ 184 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చే సమయానికి లెఫ్ట్ పార్టీల ఓటుబ్యాంకు పటిష్టంగానే ఉంది. తృణముల్ కాంగ్రెస్ కు 38.93 శాతం ఓటింగ్ షేర్ వస్తే, కేవలం 40 సీట్లు మాత్రమే గెలుచుకున్న సిపిఎంకు 30.08 శాతం ఓట్లు వచ్చాయి. చాలా స్వల్ప మెజారిటీతో నే ఎక్కువ నియోజకవర్గాల్లో సిపిఎం ఓటమిపాలైంది.

2016 అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి సిపిఎం మరింత దిగజారింది. మరోపక్క తృణమూల్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది. 2016 ఎన్నికల్లో తృణమూల్ పార్టీ 44.91 ఓటింగ్ షేర్ ను సాధించి 294 నియోజకవర్గాల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ లో ఏకంగా 211 స్థానాల్లో ఒంటరిగా విజయం సాధించింది. అదేసమయంలో సిపిఎం పార్టీ తన మిత్ర పక్షాలతో సీట్లను పంచుకోగా 148 నియోజకవర్గాల్లో నే బరిలో నిలిస్తే కేవలం ఇరవై ఆరు నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. ఓటింగ్ షేర్ కూడా పడిపోయింది. 2016 ఎన్నికల్లో సిపిఎం 19.75 శాతం ఓట్లను మాత్రమే సాధించి, 10.35 ఓటింగ్ షేర్ ను కోల్పోయింది. ఈ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ 6.0 ఓటింగ్ షేర్ ను అధికంగా రాబడితే, కాంగ్రెస్ పార్టీ కు 3.15 శాతం ఓటింగ్ షేర్, బిజెపి కు 5.56 ఓటింగ్ షేరు పెరిగింది. అంటే సిపిఎం పార్టీ కోల్పోయిన 10 శాతం పైగా ఓట్ షేర్ ను ఈ మూడు పార్టీలు పంచుకున్నాయి అని అర్థమవుతుంది.

2019 లోక్సభ ఎన్నికలు వచ్చే సమయానికి సిపిఎం పార్టీ మరింత బలహీనపడింది. 2011లో బీజేపీ కు వెస్ట్ బెంగాల్ మొత్తంమీద 4.06 శాతం ఓటింగ్ షేర్ ఉంటే, అది 2016 అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి 10.16 శాతం అయ్యింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బిజెపి ఓటింగ్ గణనీయంగా పెరిగింది. వెస్ట్ బెంగాల్ నుంచి 18 మంది ఎంపీలను గెలుచుకున్న బీజేపీ 40.25 శాతానికి తన ఓటింగ్ షేర్ పెంచుకోవడం విశేషం. అదేసమయంలో సిపిఎం పార్టీ 2019 ఎన్నికల్లో కేవలం 7.46 శాతం ఓటింగ్ కు పడిపోయింది.

ప్రస్తుతం కీలకంగా ఉన్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఇప్పుడు సిపిఎం పార్టీ కోల్పోయిన ఓట్లు ఎటు వెళ్తాయి అనేది కీలకంగా మారింది. దీనికోసం మమతా బెనర్జీ బహిరంగంగానే సిపిఎం మద్దతుదారులు తమ కు అనుకూలంగా ఓటు వేయాలని కోరుతున్నారు. అలాగే బిజెపి సైతం కమ్యూనిస్టు పార్టీ నాశనం కావడానికి మమతాబెనర్జీ తీసుకున్న విధానాలే కారణం అనే కోణంలో ప్రచారం చేస్తూ, జాతీయ పార్టీ అయిన బీజేపీ కు మద్దతు పలకాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. అయితే రాను రాను దిగజారిపోతున్న సిపిఎం పార్టీ ఓటర్లు ఎటువైపు వెళ్లారు? వారి మద్దతు ఎవరికి ప్రయోజనం అన్నది ఫలితాలు వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

Also Read : పని మనిషి, రోజువారీ కూలీ! వీరే బీజేపీ అభ్యర్థులు!!