iDreamPost
iDreamPost
జనసేన అధినేత మళ్ళీ జనం ముందుకు వచ్చారు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుతో పాటుగా ఆయన కూడా ఏపీకి గెస్ట్ పొలిటీషియన్ గా మారారు. అప్పుడప్పుడు తనకు తోచినప్పుడు లేదా తన వారికి అవసరం వచ్చినప్పుడు ఆయన సీన్ లోకి వస్తారు . మళ్ళీ వెంటనే తన స్క్రీన్ వ్యవహారాలకు వెళుతుంటారు.
ఏపీలో ప్రస్తుతం ఇళ్ల పట్టాభిషేకం జోరుగా సాగుతోంది. జనం తమకు పెద్ద పండుగ కన్నా ముందే పండుగ వచ్చిందని సంతోషిస్తున్నారు. సుదీర్ఘకాలం నుంచి కలగా మిగిలిన తమ వాంఛ నెరవేరుతుందనే ఆనందంలో ఉన్నారు. అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి, రెండు విడతల్లో ఇంటి నిర్మాణం కూడా చేసి ఇచ్చేందుకు ప్రభుత్వం రంగంలో దిగింది. ఇప్పటికే స్వయంగా సీఎం చేతుల మీదుగా కాకినాడ, శ్రీకాళహస్తి నియోజకవర్గాల పరిధిలో లబ్ధిదారులు పట్టాలు అందుకున్నారు. ఏకంగా ఏపీ అంతటా 17 వేల ఇళ్ల కాలనీల నిర్మాణం పనులు షురూ అయ్యాయి. అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు ఇళ్లనిర్మాణమే చర్చనీయాంశంగా మారింది. ఒకేసారి 31లక్షలమంది లబ్ధిదారులకు ప్రయోజనం దక్కించుకుంటూ, ప్రత్యక్షంగా 1.25 కోట్ల మందికి మేలు కలుగుతుండడమే దానికి మూలం.
సరిగ్గా ఈ సమయంలో పవన్ ఎంట్రీ ఇచ్చి రైతుల సమస్యలపై వినతిపత్రం అంటూ హంగామా చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఆయన మచిలీపట్నం వెళ్లి కలెక్టర్ ని కలవడానికి గుడివాడకి సంబంధమే లేదు. అయినా అక్కడికి వెళ్లి, నాని పేరుతో విమర్శలు చేయడం అనుమానాస్పదంగా మారింది. పైగా రెచ్చగొట్టే రీతిలో చేసిన వ్యాఖ్యలు ప్రజలను పక్కదారి పట్టించే యత్నమే అనే సందేహాలు వస్తున్నాయి. తాను వ్యక్తిగత విమర్శల జోలికి పోనని చెప్పిన పవన్ ఇప్పుడు మాత్రం నాని మీద నోరూపారేసుకున్న తీరు అతడి అసలు.లక్ష్యం వేరు అనే అనుమానాన్ని బలపరుస్తోంది
పైగా రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ తో పాటుగా ఫసల్ బీమా నిధి కూడా ఈనెల 15 వ తారీకునే రైతుల ఖాతాల్లో జమయ్యాయి. అసెంబ్లీలో సీఎం చెప్పినట్టు చేసి చూపించారు. ఇక నివర్ తుఫాన్ నష్టపరిహారం కూడా లెక్కలు పూర్తి జేసీ నెలాఖరులోగా న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వం కంకణంకట్టుకుంది. అదే సమయంలో ఈ నెలలో పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందాలు తమ నివేదిక ఇంకా సమర్పించలేదు. కేంద్ర ప్రభుత్వ సాయం అందనే లేదు. పవన్ కి చిత్తశుద్ధి ఉంటే కనికరించని కేంద్రాన్ని నిలదీయాలి. పైగా మిత్రపక్షంగా చెప్పుకుంటారు కాబట్టి మరింత బాధ్యత ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా 15 రోజుల క్రితమే దాదాపు 2 వేల కోట్లు సాయం చేసిన ప్రభుత్వం మీద విమర్శలకు పూనుకోవడం అతని నైజాన్ని చాటుతోందని పలువురు భావిస్తున్నారు. డిసెంబర్ నెలాఖరులోగా పంట నష్టపరిహారం చెల్లించే పనిలో ప్రభుత్వం ఉంటే పవన్ ప్రహసనం ఎందుకో అన్నది విస్మయకరంగా ఉంది.
పేదలకు ఇళ్ళు నిర్మించేందుకు ప్రభుత్వం యత్నిస్తుంటే అడ్డుకున్న విపక్ష టీడీపీ మీద ప్రజాగ్రహం కనిపిస్తోంది. అలాంటి సమయంలో జనం దృష్టిని మరల్చే యత్నంలో పవన్ ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. పైగా చంద్రబాబు సమస్యల్లో ఉన్నారని తెలియగానే రైతు సమస్యని ప్రస్తావించడం విడ్డురంగా మారింది. పైగా ఎకరానికి రూ.35 వేలు ఇవ్వాలని చేసిన డిమాండ్ అతిశయోక్తిగా మారింది. గతంలో పవన్ మద్దతుతో పాలన చేసిన చంద్రబాబు చివరకు పంటలబీమా నిధులు చెల్లించకపోయినా ఉలుకూపలుకు లేని పవన్ ఇప్పుడు మాత్రం అన్నీ సకాలంలో జమచేస్తున్న సర్కారుపై విమర్శలకు పూనుకోవడం విచిత్రంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఏపిలో జగన్ పాలనకు జనాల్లో ఆదరణ కొనసాగుతున్న పరిస్థితిని బాబు, పవన్ సహించలేక పోతున్నారు అనడానికి ఈ విమర్శలు, వ్యవహారాలు నిదర్శనంగా నిలుస్తున్నాయు. ప్రజలకు సొంత ఇంటి కలనెరవేరుతుండగా అడ్డుకున్న వారిపై ఒక్కమాట కూడా మాట్లాడలేక పోయిన పవన్ డైవర్షన్ పాలిటిక్స్ ఫలితాన్నివని రాజకీయపరిశీలకుల అభిప్రాయంa