iDreamPost
iDreamPost
రాయలసీమ నేతలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో.. ఇలా గ్రేటర్ రాయలసీమ అంటూ కొత్త నినాదం పిలుపునివ్వడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. అయితే ప్రజలందరూ ఆమోదించిన మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా పురుడోపోసుకుంటున్న కొత్త ఉద్యమం ఎలా ముందుకు సాగుతుందన్నదే ఇప్పుడు ప్రశ్న..
కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకొని గ్రేటర్ రాయలసీమ ఉద్యమం తేవాలని రాయలసీమకు చెందిన కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు . రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వ్యతిరేకిస్తున్న నేతలు ఇలా కొత్త ఉద్యమంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఈ మధ్యే మాజీ మంత్రి మైసూరారెడ్డి నివాసంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, ఆంజనేయరెడ్డిలు సమావేశమయ్యారు.
Read Also: ప్రపంచంలో ఎవరు అడ్డు వచ్చినా ఆగదు
ప్రధానంగా మూడు రాజధానుల నిర్ణయంలో కర్నూలుకు హైకోర్టు ఇస్తామనడం పై స్వాగతిస్తూనే.. కర్నూలులోనే రాజధాని పెట్టాలని కోరుతున్నారు. ఇందుకోసం ఉద్యమాలు చేయాలని నిర్ణయించుకుంటున్నారు. తాజాగా కర్నూల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇంట్లో నేతలంతా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై విద్యార్థి సంఘాలతో కూడా చర్చలు జరుపుతున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అందుకే ముందస్తుగా విద్యార్థి సంఘాల నేతలను చర్చల్లోపాల్గొనేలా చూసుకుంటున్నారు.
కోట్లసూర్యప్రకాష్ రెడ్డి అవసరం అయితే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారంట. తెలుగుదేశం పార్టీలో ఉండటం కంటే పార్టీలో లేకుండా ప్రత్యక్ష్యంగా ఉద్యమంలో ఉంటే మేలని నేతలు అభ్రిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. అయితే పార్టీలకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొంటారా.. లేదంటే పార్టీల్లో కొనసాగుతూనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతారాన్నది తెలవలసుంది.
Read Also: చేతులెత్తి వేడుకుంటున్నా.. చంద్రబాబు
రాయలసీమ ఉద్యమం ఉదృతం కావాల్సిన అవసరం ఉందా అంటే భిన్నమైన అభిప్రాయలు వెలువడుతున్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పటికి వై.ఎస్ జగన్ అధికారం చేపట్టినప్పటికీ చాలా మార్పులు ఉన్నాయి. ప్రధానంగా రాయలసీమ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది వైసీపీ ప్రభుత్వం. అందుకోసమే ముందస్తుగా రైతన్నల కోసం సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ప్రతి ఎకరాకు నీరు అందించి బీడు భూములను సైతం సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
ఇందుకు నిదర్శనం ఇటీవలె సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని చెప్పొచ్చు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఆర్.డి.ఎస్ (రాజోలి బండ డైవర్షన్ స్కీం) కుడి కాలువ పనులు చేపట్టేందుకు తాజాగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రూ. 1985.42 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. కోసిగి మండలంలోని బాత్రా బొమ్మలపురం వద్ద దీన్ని నిర్మించనున్నారు. జిల్లాలో 166 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ ప్రవహించి ఉల్చాల, జి. శింగవరం మధ్య ఉన్న కర్నూలు బ్రాంచి కాలువలో ఇది కలువనుంది. దీనివల్ల మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాలలో ప్రత్యక్ష్యంగా 40వేల ఎకరాలు పరోక్షంగా 30వేల ఎకరాలకు నీరందే అవకాశం ఉంది. తెలుగుగంగ లైనింగ్ పనులు రూ. 280.27 కోట్లతో చేపట్టనున్నారు. రీటెండరింగ్ పిలిచిన ఈ పనులు త్వరలోనే మొదలవ్వనున్నాయి.
Read Also: నారా వారి నయా రిఫరెండం….!
వీటితో పాటు హంద్రీనీవా కాలువ నుంచి 68 చెరువులకు నీరు ఇచ్చేందుకు రూ. 224.26 కోట్లతో ప్రారంభించిన పనులు ఇప్పటివరకు 40 శాతం మాత్రమే పూర్తయ్యాయి. అయితే మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవే కాకుండా వై.ఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా గాజులదిన్నె ప్రాజెక్టుకు నీరు ఇచ్చేందుకు జీవో విడుదలచేశారు. హంద్రీనీవా కాలువ నుంచి 110 కిలోమీటర్ల దగ్గర అదనపు స్లూయీజ్ ఏర్పాటుచేసి గాజులదిన్నె ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటిని మళ్లించనున్నారు. గాజులదిన్నెనుంచి 23 గ్రామాల ప్రజలకు తాగునీరు 25వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుంది. వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ ప్రాంతం మొత్తం ఇబ్బందులు లేకుండా ఉండనుంది. అంతేకాకుండా వేదవతి నదిపై హాలహర్వి మండలం గూళ్యం వద్ద ఎత్తిపోతల నిర్మించేందుకు రూ. 1942.80 కోట్లతో సిద్ధమైంది.
రాయలసీమ నేతలు ఎక్కడ సభలు పెట్టి మాట్లాడినా ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులైన వీటి గురించే మాట్లాడతారు. అయితే వీటన్నింటినీ ముందుగానే చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో నేతలు మరో ఉద్యమమంటూ ఎందుకు సిద్ధమవుతున్నారన్న ప్రశ్న ఎదురవుతుంది. వీరందరూ ముఖ్యంగా కోట్ల,గంగుల టీడీపీ నాయకులు కాగా,మైసూరా మాజీ టీడీపీ నేత… కేవలం వారి రాజకీయ మనుగడ కోసమే ఉద్యమం నిర్మించే ప్రయత్నం చేస్తున్నారా?
రాయలసీమ హితులుగా ముఖ్యమంత్రి జగన్ను ఒకసారి కూడా కలిసి సీమకు ఏమి కావాలి అన్నదాని మీద ప్రతిపాదనలు చేయకుండా ఉద్యమం అంటూ కొత్త రాజకీయం మొదలు పెట్టిన ఈ నేతలకు ప్రజలమద్దతు దక్కటం కష్టమే.