iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల సందర్భంగా మొదలయిన రాజకీయ పరిణామాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్ట్ తీర్పు వెలువడగానే విపక్షం మరోసారి తన వ్యూహాలకు పదును పెడుతున్నట్టు కనిపిస్తోంది. అధికార పక్షాన్ని ఇప్పటికే ఇరకాటంలోకి నెట్టిన వాయిదా వ్యవహారంలో ప్రక్రియ మళ్లీ మొదటికి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అలాంటి డిమాండ్ వినిపిస్తున్న విపక్షాలకు తోడుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఏపీలో ఏకగ్రీవాల వెనుక రాజకీయ ఒత్తిళ్లున్నాయని, అధికారపక్షం, పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయలేదనే అభిప్రాయాన్ని కలిగించేలా రాసిన లేఖలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వాదనలు ఇప్పటికే విపక్షం చేస్తున్న విమర్శలకు అనుగుణంగా ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
నిమ్మగడ్డ రమేష్ అనే పేరుతో ఉన్న మెయిల్ నుంచి కేంద్ర హోం శాఖకు లేఖ చేరిందనేది నిర్దారణ అయ్యింది. అదే సమయంలో డీజీపీకి ఆదేశాలు కూడా వచ్చినట్టు సమాచారం. ఎస్ ఈ సీ రక్షణకు సంబంధించిన తగిన చర్యలు చేపట్టాలని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ఆ లేఖ తాను రాసింది కాదంటూ స్వయంగా ఆయనే కొందరు మీడియా ప్రతినిధుల వద్ద ప్రస్తావించినట్టు ప్రచారం సాగడం విస్మయకరంగా ఉంది. తన రాసిన లేఖా కాదా అన్నది స్పష్టత ఇవ్వకుండా రమేష్ కుమార్ ఎందుకు గోప్యత పాటిస్తున్నారన్నది కూడా సందేహాలకు అవకాశం ఇస్తోంది. గందరగోళానికి మూలం ఆయనే అన్న వాదనకు బలం చేకూరుస్తోంది. ఆయన సంతకంతో కూడా లేఖ హల్ చల్ చేస్తుంటే దానిపై పూర్తిస్థాయి స్పష్టత ఇచ్చి సందిగ్ధత తొలగించాల్సిన అధికారి అందుకు బిన్నంగా వ్యవహరించడం వెనుక ప్రత్యేక వ్యూహాలు ఉన్నట్టు కనిపిస్తోంది.
ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్ట్ కి వెళ్లిన ఏపీ ప్రభుత్వానికి ఆశించిన ఫలితం దక్కలేదు. అదే సమయంలో ఎన్నికల కోడ్ విషయంలోనూ, నిర్వహణలో ప్రభుత్వంతో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఎస్ ఈ సీ తీరుని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. అయితే ఇప్పుడు ఎన్నికలు ఆరు వారాల తర్వాత జరుగుతాయా లేదా అన్నది అస్పష్టత ఉంది. అదే సమయంలో ఎన్నికల కోడ్ ఎత్తివేసిన నేపథ్యంలో మొత్తం ఎన్నికలన్నీ మొదటి నుంచి నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి , అది కూడా కేంద్ర బలగాల ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరుతున్నాయి. ఇప్పుడు ఎస్ ఈ సీ లేఖగా చెబుతున్న దానిలో కూడా అలాంటి అంశాలే ప్రస్తావించారు. ఏకగ్రీవాలు సక్రమం కాదనే రీతిలో ఆయన స్పందించారు. దానికి తోడు కేంద్ర బలగాలు పంపిస్తే తప్ప ఎన్నికలు సజావుగా సాగే అవకాశం లేదని చెబుతున్నారు. తద్వారా ఆయన విపక్షాలు కోరుకుంటున్నట్టు ఎన్నికల ప్రక్రియ మళ్ళీ మొదలు పెట్టించాలనే లక్ష్యంతో ఉన్నారనే వాదనకు ఆస్కారం కలుగుతోంది.
కడప జిల్లాలో ఏకగ్రీవాలను ప్రస్తావించడం వెనుక అసలు కారణం అదేననే అభిప్రాయం వినిపిస్తోంది. ఇలాంటి రాజకీయ అంశాలను నేరుగా ఎస్ ఈ సీ కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లారంటే ఎన్నికలు వాయిదా కాదు, మళ్లీ మొదటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారనిపిస్తోందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎస్ ఈ సీ లేఖ అంశం సందిగ్ధంలో ఉండగానే బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు లేఖ రాయడం, టీడీపీ, సీపీఐ నేతలు కూడా లేఖలోని అంశాలను వల్లించడం వంటి పరిణామాలు ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయి. దాంతో ఎన్నికల ప్రక్రియ ఎటు మళ్లుతుందనేది కీలకంగా మారుతోంది. అదే జరిగితే అధికార పార్టీ ఏ రీతిన స్పందిస్తుందోననే ఆసక్తి రేగుతోంది. ప్రస్తుతం విపక్షాల వాదనను ఎస్ ఈ సీ బలపరుస్తున్నట్టు రూఢీ అవుతున్న తరుణంలో అధికార పార్టీ అందుకు ఎలాంటి ప్రతివ్యూహాలతో సాగుతుందన్నది చర్చనీయాంశంగా మారుతోంది. ఈ పరిణామాలతో ఏపీలో స్థానిక ఎన్నికల చుట్టూ రాజుకున్న రాజకీయ రచ్చ మరికొంత సాగుతుందనడానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి.