ప్లాస్మా థెరపీ అంటే ఏంటి?

ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్‌ చికిత్సకు ఎలాంటి మందు,వ్యాక్సిన్, అందుబాటు లేకపోవడంతో “ప్లాస్మా థెరపీ”అనే వైద్య విధానం వెలుగులోకి వచ్చిది.ఈ థెరపీ వల్ల నలుగురు కరోనా పేషంట్లు పూర్తిగా కోలుకున్నట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ శనివారం ప్రకటించారు.అలాగే తాజాగా ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 49 ఏళ్ల కరోనా పేషెంట్ ప్లాస్మా థెరపీ చికిత్సతో కోలుకొని ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

ఈ నేపథ్యంలో “ప్లాస్మా థెరపీ” చికిత్సా విధానం గురించి మనము తెలుసుకుందాం.

అసలు ప్లాస్మా థెరపీ అంటే?

రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉన్నవారిపై కరోనా వైరస్‌ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. దానికి కారణం వారి శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే వారిలోని తెల్ల రక్త కణాలు వైరస్‌పై దాడి చేసి దానిని నాశనం చేస్తాయి.దీంతో కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్న వారి రక్తంలో రోగ నిరోధక కణాల సంఖ్య బాగా వృద్ధి చెంది ఉంటుంది.కాగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.అలాంటి వ్యక్తుల శరీరంలో రోగనిరోధక కణాలను పెంచగలిగితే వ్యాధిని ఎదుర్కొనే వీలుంటుంది.

వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం పొందిన వ్యక్తుల నుంచి యాంటీ బాడీస్‌ను సేకరించి, అదే వైరస్‌తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కిస్తారు.ఈ యాంటీ బాడీస్‌ మనిషి రక్తంలోని ‘ప్లాస్మా’ అనే ద్రవములో ఉంటాయి.ఈ చికిత్సా విధానాన్ని “ప్లాస్మా థెరపీ” అంటారు.

ప్లాస్మా థెరపీ విదానం :

వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేవని నిర్ధారించిన వ్యక్తుల (దాత) నుంచి ‘ఆస్పెరిసిస్’ అనే విధానం ద్వారా రక్తాన్ని సేకరిస్తారు.ఈ విధానంలో రక్తం నుంచి ప్లాస్మా లేదా ప్లేట్‌లెట్లను వేరు చేస్తారు. మిగతా రక్తం మళ్లీ దాత శరీరంలోకి వెళ్లిపోతుంది. ఒక దాత నుంచి దాదాపు 400-600 మిల్లీ లీటర్ల వరకు ప్లాస్మాను తీసుకొని దానిని ఒక్కొక్కరికి 200 మి.లీ చొప్పున ఎక్కిస్తారు.

ప్లాస్మా థెరపీ చికిత్స విధానంలో తీసుకోవలసిన జ్యాగ్రతలు :

ప్లాస్మా ఇచ్చే రక్తదాతకు హెపిటైటీస్‌ బీ,హెపిటైటిస్‌ సీ,హెచ్ఐవీ లాంటి జబ్బులు లేకుండా ఉండాలి.ప్లాస్మా ఇచ్చే రక్తదాత నుంచి సేకరించిన ప్లాస్మాలో వైరస్‌ను ధీటుగా ఎదుర్కొనే స్థాయిలో యాంటీ బాడీస్‌ అభివృద్ధి చెంది ఉండాలి.అలా లేని పక్షంలో ప్లాస్మా థెరపీ తీసుకున్న వ్యక్తికి జబ్బు తగ్గకపోగా మరింత తీవ్రమై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.ఈ థెరపీ వల్ల రోగిలో సహజసిద్ధంగా ఉండే రోగ నిరోధక శక్తి నశిస్తుంది.భవిష్యత్తులో ఎదురయ్యే జబ్బులను ఎదుర్కోవడంలో వైఫల్యం కనిపిస్తుంది. అయినప్పటికీ మందు లేని వైరస్‌ల ఇన్‌ఫెక్షన్లకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్లాస్మా థెరపీని ఉపయోగిస్తారు.

Show comments