iDreamPost
iDreamPost
మోడీ పాలనలో అన్నీ సంచలనాలే. హఠాత్తు నిర్ణయాలే. నోట్ల రద్దు నుంచి లాక్ డౌన్ వరకూ అంచనాలకు అందని రీతిలో విధానాలే. కానీ ఇప్పుడు అనూహ్యంగా మోడీ తన నిర్ణయానికి సంబంధించిన సంకేతాలు ఇచ్చారు. లాక్ డౌన్ సడలించే ఆలోచన గురించి ఆయన ప్రస్తావించారు. తన మనసులో మాటను ముఖ్యమంత్రుల ముందు బయటపెట్టారు. ఒకసారి లాక్ డౌన్ సడలిస్తే ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వస్తారని ఆయనే చెప్పారు. అలాంటి సమస్యలను అధిగమించేందుకు కసరత్తులు చేయాలని సూచించారు. తక్కువ ప్రాణ నష్టంతో బయటపడేందుకు ఉమ్మడిగా ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు. దాంతో మోడీ తీరులో వచ్చిన మార్పు మీద చర్చ సాగుతోంది.
మార్చి 22న జనతా కర్ఫ్యూ..ఆ తర్వాత రెండు రోజులకే 24 అర్థరాత్రి నుంచి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. ఏప్రిల్ 14వరకూ మూడు వారాల పాటు లాక్ డౌన్ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి లాక్ డౌన్ కి ముందే అనేక చర్యలు చేపట్టాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వలస కూలీలు రోడ్డున పడడం వంటి సమస్యలకు తగిన సమయం ఇవ్వడం ద్వారా అధిగమించే అవకాశం ఉండేదని చెబుతున్నారు. దాని కన్నా మూడు నాలుగు వారాల ముందే మేల్కొని అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేసి ఉండాలనే వారు కూడా ఉన్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ లాక్ డౌన్ అమలులో పలు సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు సవాళ్లుగా మారాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రికత్తలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ అడపాదడపా ఘటనలు తప్పడం లేదు. అయినప్పటికీ లాక్ డౌన్ సక్సెస్ చేయడం కోసం అందరూ తమ వంతు కృషి చేస్తున్నారు.
లాక్ డౌన్ ఎన్నాళ్లు కొనసాగుతుందనే విషయంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ప్రపంచ అనుభవం రీత్యా కనీసం ఏడెనిమిది వారాలు అనివార్యం అనే వారున్నారు. చైనాలో రెండున్నర నెలల పాటు లాక్ డౌన్ తో కట్టడి చేశారు. దక్షిణాకొరియా కూడా అంతే. బ్రిటన్ లో ఏకంగా మూడు నెలలు లాక్ డౌన్ ప్రకటించారు. ఇలా ఒక్కో దేశంలో ఒక్కో అనుభవం ఉన్న తరుణంలో ఏప్రిల్ నెల అంతా లాక్ డౌన్ తప్పదని దేశంలో ఎక్కువమంది అంచనా. దానికి అనుగుణంగా మూడు నెలల పాటు ఉపశమనం కలిగించేందుకు తగ్గట్టుగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. అయితే అనూహ్యంగా ప్రధాని కొత్త చర్చను ముందుకు తీసుకొచ్చి ఏప్రిల్ 15నుంచి లాక్ డౌన్ సడలించబోతున్నట్టు సూచనలు ఇచ్చేశారు. దానికి తగ్గట్టుగా పౌరవిమానయాన మంత్రి ప్రకటనతో విమాన సర్వీసుల రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. రైళ్లలో కూడా దాదాపుగా అంతే.
ఇక ఏప్రిల్ 15 తర్వాత లాక్ డౌన్ లిఫ్ట్ చేస్తే ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందన్నది ప్రస్తుతానికి అంతుబట్ట కుండా ఉంది. ఇంకా పది రోజుల తర్వాత కరోనా ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే అంచనా వేయలేని స్థితి ఉంది. ఇండియాలో కూడా పది రోజుల క్రితం అంచనాల ప్రకారం ఇన్ని కేసులు అంచనాలో లేవు. హఠాత్తుగా ఢిల్లీ ఘటనలతో పెద్ద సంఖ్యలో కేసులు ఏపీ వంటి రాష్ట్రాల్లో వచ్చాయి. దాంతో దేశంలో ఏప్రిల్ 14నాటికి పరిస్థితి తీవ్రం అవుతుందా..తగ్గుముఖం పడుతుందా అన్నది మోడీకి సైతం అంచనాలకు అందని రీతిలో ఉంది. వాస్తవానికి మార్చి 13న దేశంలో కరోనా ముప్పు తక్కువే అని కేంద్రం భావించింది. ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. కానీ హఠాత్తుగా వారం రోజులు గడిచే సరికి సీన్ మారిపోయింది. ఇప్పుడు కూడా అదేరీతిలో రాబోయే పది రోజుల్లో ఏమయినా అనూహ్య పరిణామాలు ఉత్పన్నం అయితే తప్ప కేసులు కొనసాగే అవకాశం ఉంది.
ఓవైపు కరోనా కేసులు నమోదవుతున్నా లాక్ డౌన్ తొలగిస్తే జనం రోడ్డు మీదకు వచ్చినప్పుడు నియంత్రించడం ఎలా , దానికి యంత్రాంగం సమాయత్తం కాగలదా..ఒకసారి కరోనా తగ్గుముఖం పట్టి మళ్లీ విజృంభించిన అనుభవాలు కూడా కొన్ని దేశాల్లో ఉన్నాయి. దాంతో ఊహించని పరిణామాలు ఎదురయితే ఏం జరుగుతంది..ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతుండడంతో దానిని అధిగమించేందుకు ట్రంప్ తరహాలో మోడీ కూడా సాహసానికి పూనుకుంటున్నారా అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. ఏమయినా దేశం ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో అంతా సర్దుమణిగి యధాస్థితికి రావడానికి కొంత సమయం పట్టడం ఖాయం. ఈలోగా లాక్ డౌన్ వంటివి సడలించిన పక్షంలో పెద్ద గా సమస్యలు రాకుండా గట్టెక్కాలని అంతా ఆశిద్దాం.