చంద్రబాబు సాధించిందేమిటి..? రేపు ఏమి జరగబోతోంది..?

ఆంధ్రప్రదేశ్‌ పరిపానల వికేంద్రీకరణ, సముతల అభివృద్ధి, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు శాసన మండలి బేక్ర్‌ వేసింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన రాజకీయ చతురత, వ్యూహాలతో పై చేయి సాధించారని, అధికార వైఎస్సార్‌సీపీకి షాక్‌ ఇచ్చారని చంద్రబాబును ఓ వర్గం మీడియా ఆకాశానికెత్తేస్తోంది. చంద్రబాబు అపర చాణక్యుడిగా వ్యవహరించి అమరావతే రాజధానిగా కొనసాగేలా చేశారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కీర్తిస్తున్నారు.

బిల్లులకు సవరణలు, సెలెక్ట్‌ కమిటీకి పంపాలని మండలిలో టీడీపీ ఇచ్చిన నోటీసులు నిబంధనల మేరకు లేవంటూనే.. తన విక్షణాధికారంతో బిల్లులను సెలక్ట్‌ కమిటికీ పంపిస్తున్నాని మండలి చైర్మన్‌ షరీఫ్‌ అసాధారణ నిర్ణయం తీసుకోవడం వెనుక చంద్రబాబు ప్రోద్భలం ఉందనేది కాదనలేని సత్యం. శాసన మండలి చైర్మన్‌ గౌరవానికే మచ్చ తెచ్చారని పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు, తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, రాజ్యాంగ నిపుణులు నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. షరీఫ్‌ పరిస్థితికి కారణం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి.. ఒక పార్టీ నేతలాగా సదరు పార్టీ, ఆ పార్టీ ఇష్టానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడమే.

మండలి చైర్మన్‌ ద్వారా చంద్రబాబు సాధించిందేమిటంటే.. మూడు రాజధానుల ఏర్పాటును పత్రాల రూపంలో ప్రకటించకుండా అడ్డుకోవడమే తప్పా మరేమీ లేదు. ప్రభుత్వం తాను అనుకున్నది చేసేందుకు తాజాగా జరిగిన మండలి వ్యవహారం వల్ల ఎలాంటి ఆటంకం కలగదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందనడంలో సందేహం లేదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విడిపోయిన తర్వాత తెలంగాణ, ఏపీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంది. హైదరాబాద్‌పై ఏపీకి పదేళ్ల వరకు హక్కు ఉంది. ఇప్పటికీ అధికారికంగా ఏపీ రాజధాని హైదరాబాదే కావడం ఇక్కడ విశేషం. ఓటుకు నోటు కేసు పరిణామాల నేపథ్యంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లడం తెలిసిందే. కనీసం ఒక్క భవనం కూడా లేని అమరావతి నుంచి పాలన సాగించేందుకు సిద్ధమయ్యారు. ఏపీ నూతన రాజధానిగా అమరావతిని 2014 ఆఖరులో ప్రకటించినా కూడా ఇప్పటి వరకు దాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకపోవడం గమనార్హం.

కేవలం మాట ద్వారా ఏపీ రాజధాని అమరావతి అంటూ హైదరాబాద్‌ నుంచి కార్యాలయాలను తరలించగా.. నేడు అమరావతి నుంచి విశాఖకు, లేదా మరే ప్రాంతానికైనా ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదనేది నిపుణులు చెబుతున్న మాట. ప్రతిపక్ష పార్టీ దీన్ని అడ్డుకోలేదు. గత చరిత్ర వల్ల విమర్శించనూ లేదు. మరి చంద్రబాబు ఏమి సాధించబోతున్నారో.. ప్రస్తుత పరిస్థితి తాలుకూ ఫలితాలు టీడీపీకి ఎలాంటి ప్రయోజనం చేయబోతున్నాయో వేచి చూడాలి.

Show comments