iDreamPost
iDreamPost
ఏపీలో మళ్లీ కొత్త కంపెనీలకు తలుపులు తెరుచుకుంటున్నాయి. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో వివిధ ఐటీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వాతావరణ పరిస్థితులు, ఇతర సదుపాయాలు సానుకూలంగా ఉండడంతో చాలాకాలంగా విశాఖలో ఐటీ పరిశ్రమ ఆసక్తి చూపుతోంది.
అయితే గత ప్రభుత్వ హయంలో విశాఖలో పెట్టుబడుల సదస్సు పెట్టి, కంపెనీలు మాత్రం అమరావతిలో పెట్టాలనే కండీషన్ విధించడంతో పలువురు ఊగిసలాటలో పడ్డారనే వాదన ఉంది. అమరావతిలో మౌలిక సదుపాయాలు గానీ, ఇతర పరిస్థితులు గానీ అనుకూలంగా లేని సమయంలో ప్రభుత్వం ఎంతగా ఒత్తిడి చేసినప్పటికీ అనేక మంది పరిశ్రమల ఏర్పాటుకి సన్నద్ధం కాలేదు. దాంతో ప్రచారమే తప్ప ఫలితాలు రాలేదు. అటు విశాఖ, ఇటు అమరావతి కూడా ముందడుగు వేయలేని స్థితి దాపురించింది.
కానీ ఇప్పుడు సందిగ్ధం వీడిపోయి అమరావతిని వ్యవసాయపరంగా అభివృద్ది చేసే దిశలో ప్రభుత్వంలో ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అదే క్రమంలో విశాఖను పారిశ్రామికంగా అందులోనూ సర్వీసు రంగంలో ముందు పీఠిన నిలిపే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధ ఐటీ సంస్థలు ఆసక్తిని చూపుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. టాప్ ఐటీ సంస్థల్లో ఒకటైన క్యాప్ జెమినీ త్వరలో విశాఖలో బ్రాంచ్ ప్రారంభించబోతోంది. ఇప్పటికే టీసీఎస్ సన్నాహాలు మొదలెట్టింది. ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో టీసీఎస్ ప్రతినిధులు చర్చలు కూడా జరిపారు.
ఊబర్ కూడా విశాఖ కేంద్రంగా తమ రెండో సెంటర్ ఆఫ్ ఎకల్సెన్స్ ని ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. దేశంలోనే ఆ సంస్థకు విశాఖ రెండో కేంద్రం కాబోతోంది. హైదరాబాద్ లో ఇప్పటికే ఉంది. ఇప్పటికే విశాఖ నుంచి హెచ్ ఎస్ బీసీ, విప్రో, టెక్ మహేంద్ర, కాండ్యూయెంట్, కాన్సెంట్రిక్స్, డబ్య్ల్యూఎన్ ఎస్, మిరాకిల్, ఐబీఎం, పాత్రా ఇండియా వంటి సంస్థలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేసేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. దాంతో ఐటీ ఆశావాహులకు అవకాశాలు పెరుగుతున్నాయి.
త్వరలో పాలనా వ్యవహారాలు సాగరతీరానికి చేరబోతున్న వేళ కంపెనీల రాక కూడా తోడయితే విశాఖ అభివృద్ధి మరింత వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దేశంలో టాప్ 10వ నగరంగా ఉన్న ఈ నగరం మరింత ముందుకు దూసుకుపోయేందుకు సానుకూలత ఏర్పడుతుంది.