iDreamPost
iDreamPost
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నమోదవుతున్న ఫలితాలు దర్శకనిర్మాతలకు సరికొత్త పాఠాలు నేర్పిస్తున్నాయి. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా చెబుతున్నాయి. బ్రేక్ ఈవెన్ కు కొత్త సవాళ్లు చూపిస్తున్నాయి. మొన్న విడుదలైన విరాట పర్వంకు ఎన్ని ప్రశంసలు వచ్చినా అవి వసూళ్ల రూపంలోకి మారడం లేదు. 12 కోట్లకు పైగా జరిగిన బిజినెస్ లో సగం తేవడం కూడా గగనమే అనిపిస్తోంది. సాయిపల్లవి ఇమేజ్, విస్తృతంగా చేసిన ప్రమోషన్లు ఇవేవి నిలబెట్టలేకపోతున్నాయి. ఇక అంటే సుందరానికి నష్టాల బారిన పడేలా ఉంది. ఎంతలేదన్నా అయిదు కోట్ల దాకా లాస్ వెంచర్ గా నిలవొచ్చనేది ట్రేడ్ నుంచి అందుతున్న ఇంటర్నల్ రిపోర్ట్.
ఇక ఎఫ్3 కూడా ఇంకా లాభాల్లోకి ప్రవేశించలేదు. వీకెండ్స్ వసూళ్లు బాగున్నప్పటికీ మిగిలిన రోజుల్లో చాలా డ్రాప్ కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి మిగిలినవాటి కన్నా ఇది బెటర్ ఛాయస్ అనిపించడంతో ఆ మాత్రం గట్టెక్కుతోంది. సర్కారు వారి పాట సైతం నష్టాల బాట తప్పలేదు. మొదట్లో బ్లాక్ బస్టర్ అని చెప్పుకున్నా ఆ స్థాయికి తగ్గ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అనూహ్యంగా మేజర్ లాభాలు ఇవ్వగా విక్రమ్ డబుల్ ప్రాఫిట్స్ తో హక్కులు కొన్న నితిన్ ఫ్యామిలీని ఆనందంలో ముంచెత్తింది. 777 చార్లీ ఎలాంటి అంచనాలు లేకపోయినా చాలా చోట్ల దాన్ని అమ్మిన రేట్లను సాఫీగా వెనక్కు ఇచ్చేసింది. అందుకే మూడో వారంలోనూ కంటిన్యూ చేస్తున్నారు.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. ఆడియన్స్ గుడ్డిగా యావరేజ్ కంటెంట్ ని యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు. ఫ్యామిలీతో సహా రావాలంటే అన్నీ ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లే కానక్కర్లేదు. మంచి ఎంటర్ టైన్మెంట్ అది యాక్షన్ రూపంలో అయినా సరే లేదా కామెడీ ఇచ్చినా సరే హిట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అంతే తప్ప ఎప్పుడో గడిచిపోయిన సంఘటనల తాలూకు బాధలను,సమాజానికి సందేశాలను, సాగదీసిన కామెడీని వెండితెరపై చూసేందుకు అంతగా ఇష్టపడటం లేదు. పైగా ఓటిటిలో ఈ మధ్య వెబ్ సిరీస్ క్వాలిటీ బాగా పెరిగిపోయింది. మరి థియేటర్ దాకా రావాలంటే హంగులు ఆకర్షణలు కావాలి. అది కంటెంట్ లోనే తప్ప ప్రమోషన్ లో కాదు సుమా.