ఇప్పటికే మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ లేపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజాగా రాష్ట్రంలో 25 జిల్లాలను ఏర్పాటు చేయనున్నార ? అంటే అవుననే అంటున్నారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను విశాఖలోని వైసీపీ కార్యాలయంలో కార్యాలయంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతోనే మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా సౌలభ్యం కోసం 25 జిల్లాల ఏర్పాటు చేయాలనే ఆలోచనలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకం అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
విజయసాయిరెడ్డి చేసిన 25 జిల్లాల వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను కాస్తా 25 జిల్లాలుగా పెంచబోతున్నారన్న ఊహాగానాలకు తెరలేచింది.