iDreamPost
android-app
ios-app

లైగర్ తో 5 సినిమాల బాక్సింగ్

  • Published Aug 23, 2022 | 7:55 PM Updated Updated Aug 23, 2022 | 8:00 PM
లైగర్ తో 5 సినిమాల బాక్సింగ్

లైగర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ వస్తుంటే మాములుగా అందరూ సైడ్ ఇవ్వాలి. కానీ దానికి భిన్నంగా కేవలం ఒక్క రోజు గ్యాప్ తో చిన్న చిత్రాలన్నీ మూకుమ్మడిగా దాడి చేయాలని నిర్ణయించుకున్నాయి. దానికి ఆగస్ట్ 26 వేదిక కానుంది. వాటిలో బెటర్ ఆప్షన్ గా కనిపిస్తున్నది ‘కళాపురం’, పలాస, శ్రీదేవి సోడా సెంటర్ దర్శకుడు కరుణ కుమార్ పూర్తి ఎంటర్ టైనర్ గా దీన్ని తీయడం విశేషం. ప్రమోషన్లు గట్టిగానే చేస్తున్నారు. సునీల్ ప్రధాన పాత్ర పోషించిన ‘గీత’ అదే రోజు రానుంది. ఏదో పబ్లిసిటీ చేస్తున్నారు కానీ సౌండ్ ఏమీ వినిపించడం లేదు. ధనరాజ్-సునీల్ ల బుజ్జి ఇలా రా కూడా అదే డేట్ కి షెడ్యూల్ చేశారు కానీ తాజాగా సెప్టెంబర్ 2కి పోస్ట్ పోన్ చేస్తూ ప్రకటన ఇచ్చారు.

ఇవి కాకుండా కళింగపట్నం జీవా, భళా చోర భళా, # పీకే లు బరిలో దిగుతున్నాయి. ఒక్కదానికి కనీస బజ్ లేదు. ఓపెనింగ్స్ ఆశించడం అత్యాశే అవుతుంది. ఒకపక్క థియేటర్ల కొరత విపరీతంగా ఉంది. బింబిసార, సీతారామం, కార్తికేయ 2లకు మంచి కౌంట్ తో స్క్రీన్లు కంటిన్యూ అవుతున్నాయి. మొన్న శుక్రవారం వచ్చినవన్నీ తోక ముడిచాయి కాబట్టి మరికొన్ని అందుబాటులోకి వస్తాయి. అయితే లైగర్ ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తుండటంతో ఎగ్జిబిటర్లు అధిక శాతం దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి అలాంటప్పుడు ఒకేసారి ఇన్ని బరిలో దిగడం ఆశ్చర్యం కలిగించేదే. ముఖ్యంగా రెండు మూడు థియేటర్లు మాత్రమే ఉండే బిసి సెంటర్లకు చాలా లేట్ గా వెళ్లాల్సి ఉంటుంది.

దీనికి ప్రధాన కారణం మారిన ఓటిటి నిబంధనలే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. గతంలోలా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అంటే వెంటనే ఒప్పుకోవడం లేదు. ముందు థియేటర్లలో వదిలి అప్పుడు వచ్చే స్పందన బట్టి రేట్ నిర్ణయిస్తామని ఖరాఖండిగా చెబుతున్నాయి. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వస్తున్న సినిమాలు చాలానే ఉండబోతున్నాయి. అందులోనూ భారీ బడ్జెట్ మూవీస్ వదిలేస్తున్న శుక్రవారాలు చాలా తక్కువ. అందుకే లైగర్ లాంటివి భయపెడుతున్నా తప్పక ఇలా క్లాష్ అవుతున్నారు. ఆపై వారం కూడా ఇదే తరహా పోటీ కొనసాగనుంది. అయినా సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివని సైతం మనవాళ్ళు కేర్ చేయడం లేదు. అవసరం అలాంటిది మరి.