Idream media
Idream media
పి.చంద్రశేఖరరెడ్డి ఒకప్పుడు సోషల్ డ్రామా స్పెషలిస్ట్. కృష్ణతో తీసిన సినిమాలు లెక్కలేదు. గుర్తున్న సినిమాల్లో మొదటిది ఇల్లు, ఇల్లాలు. తిరుగుబోతు భర్తని దారిలోకి తీసుకొచ్చే భార్య కథ. కృష్ణ క్లబ్‌లో స్టెప్పులేస్తూ హాయిగా, మత్తుగా అని పాట కూడా పాడతాడు. గన్‌తో కృష్ణ ఎడాపెడా కాల్చే కాలం (1972)లో ఫ్యామిలీ స్టోరీ తీసి హిట్ చేయడం పిసి.రెడ్డికే సాధ్యం.
NTR తో బడిపంతులు పెద్ద హిట్. హీరోగా ఒక రేంజ్‌లో వున్న NTR తో ముసలి పాత్ర వేయించి సూపర్ హిట్ చేశాడు. మరాఠీ నాటకం ఆధారంగా 1958లో స్కూల్ మాస్టర్ కన్నడ సినిమా తీశారు. దీని ఆధారంగా 1972లో బడిపంతులు NTR మనవరాలిగా వేసిన శ్రీదేవి తర్వాతి రోజుల్లో NTR తో హీరోయిన్‌గా నటించడం కాల మహిమ.
రాయదుర్గంలో జయలక్ష్మి టూరింగ్ టాకీస్ అని జనాల్ని హింసించడానికి 1970లో ఒక టెంట్ వెలసింది. నేసేపేటలో వున్న ఇది మాకు చాలా దూరం. వెళ్లాలంటే పక్కన పెద్ద వాళ్లంతా వుండాలి, లేదంటే ఒక ముఠాగానైనా వెళ్లాలి. ఎందుకంటే అడుగడుగునా కుక్కల సమూహాల్ని దాటే సాహసం చేయాలి. వెళ్లేటప్పుడు ఓకే, వచ్చేటప్పుడు అవి రకరకాల మూడ్స్‌లో వుండి వెంట పడేవి.
ఇది కాకుండా దారిలో కల్లు, సారాయి అంగళ్లు ఉండేవి. తాగుబోతులు పిల్లల్ని ఎత్తుకెళ్తారనే పుకారు. బడిపంతులు సినిమా రద్దీ తట్టుకోలేక టెంట్‌ని వెడల్పు చేశారు. అయినా జనం ఆగలేదు. నేల టికెట్లు పూర్తిగా ఆడవాళ్లకే ఇచ్చారు. NTR , అంజలీదేవి విడిపోయే సీన్‌లో టెంటు మొత్తం వెక్కిళ్లే.
పిసి.రెడ్డి కథల్లో పెద్ద ప్రయోగాలుండవు. మామూలు కథలో ఎమోషన్ పండించేవాడు. పాడిపంటలు (1976) కూడా ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. 1974లో వచ్చిన పెద్దలు మారాలి డిఫరెంట్ సబ్జెక్టు. క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని హింసిస్తే జరిగే దారుణాలు కథాంశం. చైల్డ్ సైకాలజీపై వచ్చిన అతి కొద్ది తెలుగు సినిమాల్లో ఇదొకటి.
మానవుడు-దానవుడు (1972) శోభన్ కెరీర్‌లోనే సూపర్‌హిట్. ఇప్పుడు డైరెక్టర్లు రెండుమూడేళ్లకో సారి సినిమా తీయడానికి ఆయాస పడుతుంటారు. పిసి.రెడ్డి ఒకే ఏడాది (1972) ముగ్గురు హీరోలతో సూపర్‌హిట్స్ ఇచ్చాడు. ముసలిపంతులుగా NTR , రౌడీగా శోభన్, తిరుగుబోతుగా కృష్ణ మూడు వేర్వేరు కథలు.
86 ఏళ్ల వయసులో పిసి.రెడ్డి చెన్నైలో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి.
Also Read : NBK , Allu Arjun & Nani : రిస్క్ తీసుకున్నారు రిజల్ట్ అందుకున్నారు