iDreamPost
android-app
ios-app

వెంకీ సినిమాకు వెరైటీ టైటిల్

  • Published Jan 21, 2020 | 9:13 AM Updated Updated Jan 21, 2020 | 9:13 AM
వెంకీ సినిమాకు వెరైటీ టైటిల్

తమిళ్ లో గత ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన అసురన్ తెలుగు రీమేక్ నిన్నటి నుంచి ప్రారంభమైనట్టుగా సమాచారం. వెంకటేష్ హీరోగా నటిస్తుండగా అతనికి జోడిగా ప్రియమణి కనిపించనున్నది. దీనికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్ డేట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది . ముందు దీనికి అనుకున్న టైటిల్ అసురుడు. కానీ ఇది కొంచెం గ్రాంథికం టైపులో అనిపిస్తుంది.

అందుకే కథ ప్రకారం వెంకీ పాత్రకు పెట్టిన “నారప్ప” అనే పేరునే సినిమాకు పెట్టాలనే ఆలోచనలో నిర్మాత సురేష్ బాబు ఉన్నట్టు సమాచారం. నారప్ప అని ఎందుకంటే ఇది సీమ బ్యాక్ డ్రాప్ లో సాగే పల్లెటూరి కథ. అక్కడి గ్రామాల్లో జనాల పేర్లు ఇలా నారప్ప బీరప్ప అనే ఉంటాయి. ఈ నేపథ్యంలో నారప్ప అనేది మాస్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని అనుకుంటున్నారట వెంకటేష్ ఇందులో బాగా వెనుకబడ్డ సామాజికవర్గానికి చెందిన పాత్రలో కనిపిస్తాడు.

ఒకరకంగా చెప్పాలంటే జయంమనదేరాకు రివర్స్ లో అన్నమాట. కులధిపత్యాన్ని ఎదిరిస్తూ తన బిడ్డను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకునే ఆవేశపూరితమైన పాత్రలో తమిళ్ లో ధనుష్ చెలరేగిపోయి నటించాడు . అందులోనూ సగానికి పైగా సినిమా వయసు మళ్ళిన వేషం కాబట్టి వెంకటేష్ ఎలా చేస్తాడో వేరే చెప్పాలా. సెన్సిబుల్ మూవీస్ తీస్తాడని పేరున్న శ్రీకాంత్ అడ్డాల దీన్ని ఎలా తీర్చిదిద్దుతాడా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వేసవిలోనే విడుదల చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నారు. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ఇందులో ఎలాంటి డ్యూయెట్లు కాని హుషారుభరిత గీతాలు కాని ఉండవు.