iDreamPost
iDreamPost
అన్నీ కుదిరుంటే ఈ పాటికే వెంకటేశ్-తేజ సినిమా సగానికి పైగా పూర్తయ్యేది. కానీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు ఈ చిత్రం. దానికి కారణం బాలకృష్ణ. ఆయనతో కమిటైన తేజ. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు వెంకీ నలిగిపోతున్నాడు. అప్పుడెప్పుడో వెంకటేశ్ పుట్టినరోజున డిసెంబర్ లో కొబ్బరి కాయ్ కొట్టారు ఈ చిత్రానికి. కానీ ఇప్పటి వరకు ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. జనవరిలోనే అనుకున్నా కూడా ఇప్పుడు కుదరట్లేదు. దాంతో ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేసారు ఈ చిత్ర షూటింగ్ ను. ఈ చిత్రంలో వెంకీ లెక్చరర్ గా కనిపిస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. 23 ఏళ్ల కింద సుందరాకాండలో లెక్చరర్ గా నటించిన వెంకటేశ్.. మళ్లీ ఇప్పటి వరకు అలాంటి పాత్రలో నటించలేదు. మళ్ళీ ఇన్నేళ్లకు వెంకీ లెక్చరర్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ పాత్రపై తేజ చాలా శ్రద్ధ పెడుతున్నాడని.. ముఖ్యంగా వెంకటేశ్ ఈ చిత్రాన్ని రెండు నెలల్లోనే పూర్తి చేయాల్సిందిగా కండీషన్ పెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ రోజుల్లో ఓ స్టార్ హీరో సినిమా చేయాలంటే కనీసం 8 నెలలు కావాల్సిందే.. మరీ సూపర్ ఫాస్ట్ గా చేస్తాడంటే ఆర్నెళ్లైనా కావాల్సిందే కానీ మరీ మూడు నెలల్లో సినిమా పూర్తి చేయడం అంటే మాటలు కాదు. కానీ ఇప్పుడు ఆ ఛాలెంజ్ ను తీసుకుంటున్నాడు తేజ. దీనికి ఆటనాదే వేటనాదే అనే టైటిల్ పరిశీలిస్తున్నాడు. పవర్ ఫుల్ స్టోరీ లైన్ తో తెరకెక్కబోతుంది. ఇందులో నారా రోహిత్ కూడా కీలకపాత్రలో నటించబోతున్నాడు. వెంకీకి తమ్ముడు పాత్ర ఇది. వెంకటేశ్ సినిమాను 60 రోజుల్లోనే పూర్తి చేయాలనేది కండీషన్. వెంకీ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాలయ్యను లైన్ లో పెట్టాడు తేజ. అందుకే వెంకీ సినిమాను మార్చ్ లోపు పూర్తి చేయాలనేది తేజ ప్లాన్. మరి చూడాలిక.. ఈ కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుందో..?