iDreamPost
android-app
ios-app

ఏబీఎన్ నుంచి కూడా వెంకట కృష్ణ అవుట్, అసలు కారణమేంటీ..?

  • Published Mar 23, 2021 | 2:37 PM Updated Updated Mar 23, 2021 | 2:37 PM
ఏబీఎన్ నుంచి కూడా వెంకట కృష్ణ అవుట్, అసలు కారణమేంటీ..?

ఈటీవీతో ప్రారంభించి, టీవీ5, హెచ్ ఎం టీవీ, 6టీవీ, ఏపీ 24 మీదుగా ఏబీఎన్ వరకూ సాగిన వెంకట కృష్ణ ప్రస్థానానికి మరోసారి బ్రేక్ పడింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ ఆయన్ని స్వల్పకాలంలోనే సాగనంపినట్టు తెలుస్తోంది. వరంగల్ కి చెందిన వెంకటకృష్ణ తన సొంత కమ్మ కులస్తుల అండదండలతో ఏపీ వ్యవహారాల్లో చొరవగా వ్యవహరించేవారు. అందులోనూ టీడీపీకి అనుకూలంగా ఉండే జర్నలిస్టుల్లో ఒక్కరిగా పేరుపొందారు. టీవీ చర్చల సందర్భంగా టీడీపీకి. చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించేందుకు శతవిధాలా ప్రయత్నించడం అనేకమార్లు స్పష్టమయ్యింది. ఆ ఒక్క కారణంగానే ఏపీ 24 7 టీవీ చానెల్ నుంచి వైదొలగాల్సిన వెంకటకృష్ణకు ఏబీఎన్ లో ఆశ్రయం దక్కింది. అయితే తాజాగా అక్కడి పరిణామాల్లో అనూహ్యంగా వెంకట కృష్ణ వైదొలగాల్సి రావడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

ఢిల్లీ మీడియా, తెలుగు మీడియా అనే తేడా లేకుండా టీవీ యాంకర్లు ఏదో పార్టీ ముద్ర వేసుకోవడం ఇటీవల బాగా పెరిగింది. తమ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా టీవీ చర్చలు సాగిస్తూ వీక్షకుల ముందు చాలామంది బండారం బయటపెట్టుకుంటున్నారు. ఆ క్రమంలోనే వెంకటకృష్ణ వ్యవహారం వెల్లడయ్యింది. తాను న్యూట్రల్ జర్నలిస్టు అని తానే చెప్పుకున్నప్పటికీ సగటు ప్రేక్షకుడి దృష్టిలో ఆయనో చంద్రబాబు క్యాంప్ జర్నలిస్టుగా ముద్ర ఉంది. ఏ టీవీ చానెల్లో పనిచేసినా ప్రతీ సందర్భంలోనూ ఆయన ప్రభుభక్తిని ప్రదర్శించేవారని పలువురు భావిస్తారు. సోషల్ మీడియాలో దానికి తగ్గట్టుగానే ఆయన మీద తీవ్ర విమర్శలు కూడా ఉన్నాయి.

Also Read : కడలి తీరంలో రాజకీయ కాక!

అదే సమయంలో కొన్ని సంస్థల్లో వెంకటకృష్ణ వ్యవహారాలు పెద్ద చర్చకు దారితీశాయి. తాజాగా ఇప్పుడు ఏబీఎన్ లో ఆయన వైదొలగాల్సి రావడం వెనుక కూడా ఆర్ధిక సంబంధిత ఆరోపణలున్నాయని ప్రచారం సాగుతోంది. సహజంగా టీడీపీ నుంచి నేరుగా ప్యాకేజీ అందుకుంటారని ఏబీఎన్ రాధాకృష్ణ మీద విమర్శలున్నాయి. అందుకే చంద్రబాబుకి అనుకూలంగా తన మీడియా సంస్థల మీద పచ్చ ముద్ర వేయించుకున్నట్టు అంతా భావిస్తుంటారు. అదే సంస్థలో పనిచేస్తూ కొందరు తమ సొంత ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుండడంతో యాజమాన్యం సహించలేపోయిందనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం వెంకటకృష్ణ రెండేళ్లలోపులోనే ఏబీఎన్ నుంచి బయటకువెళ్లేందుకు కారణమయిన వాటిలో అనేక అంశాలున్నాయని కూడా గుసగుసలు వినిపిస్తోంది.

రాధాకృష్ణ- వెంకట కృష్ణ కాంబినషన్ లో ఏపీ ప్రభుత్వం మీద, జగన్ పాలన మీద పదే పదే రాళ్లు వేసిన నేపథ్యంలో ఇప్పుడా ద్వయం చెరో దారి కావడం విశేషమే. ప్రస్తుతమున్న మీడియా వాతావరణంలో మళ్లీ వెంకటకృష్ణకు మరోచోట అవకాశం దక్కే అవకాశాలు కూడా నామమాత్రంగానే కనిపిస్తున్నాయి.

Also Read : ఎస్‌ఈసీ నీలం సాహ్ని..?