iDreamPost
iDreamPost
తెలుగు మీడియాలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఓవైపు టీవీ5 కీలక జర్నలిస్టుల విషయంలో పలు ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఏబీఎన్ గూటికి వెంకట కృష్ణ చేరిపోయారు. ఇప్పటికే పలు చానెళ్లు మారిన ఆయన చివరకు దాదాపుగా సొంత గూటికి చేరినట్టుగా చాలామంది భావిస్తున్నారు. టీడీపీ వాణీ వినిపించేందుకు అనేక చోట్ల ప్రయత్నాలు చేసిన ఆయనకు ఇటీవల ఏపీ 24 చానెల్ లో పలు సమస్యలు వచ్చి పడ్డాయి. ముఖ్యంగా యాజమాన్యంతో ఆయన తగాదా తారస్థాయికి చేరిన దరిమిలా ఆయన బయటకు రావాల్సి వచ్చింది.
ఈ పరిస్థితుల్లో వెంకట కృష్ణ తన జర్నలిజం ప్రస్థానంలో మరో సంస్థలో అడుగు పెట్టక తప్పలేదు. ఈనాడు గూటి నుంచి తొలుత జిల్లా రిపోర్టర్ గా, ఆ తర్వాత రాష్ట్ర బ్యూరోలో కీలక పాత్ర పోషించిన వెంకట కృష్ణ అక్కడి నుంచి బయటకు వచ్చి టీవీ5లో చేరారు. చివరకు ఆ సంస్థలో ప్రసారం చేసిన ఓవార్త కారణంగా అరెస్ట్ అయ్యి, జైలుకి వెళ్లిన అనుభవం కూడా వెంకట కృష్ణకు ఉంది. ఆ తర్వాత కొద్దికాలానికే మళ్లీ హెచ్ ఎం టీవీ లో చేరారు. అక్కడ తక్కువ కాలమే పనిచేసిన అనంతరం కొత్తగా ప్రారంభించిన 6టీవీలో చేరారు. అది అనూహ్యంగా మూతపడడంతో కొన్నాళ్ల పాటు తెరమరుగయ్యారు. చివరకు విజయవాడ కేంద్రంగా వచ్చిన తొలి చానెల్ సీఈవోగా పునర్దర్శనం ఇచ్చారు. అక్కడ కూడా నాలుగేళ్లు నిండక ముందే బయటకు వచ్చిన తర్వాత ఎట్టకేలకు మళ్లీ టీడీపీ సొంత చానెల్ గా చాలామంది భావించే ఏబీఎన్ లో ఎగ్జిక్యూటివ్ హోదాలో చేరారు.
ఏబీఎన్ లో ఆయన చేరిక ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇప్పటి వరకూ కాస్త నిదానంగా టీడీపీ గొంతు వినిపించేందుకు ప్రయత్నం చేసిన వెంకట కృష్ణ, ఇకపై స్వేచ్ఛగా చంద్రబాబు రాగం ఆలపించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఇన్నాళ్లుగా వెంకట కృష్ణ పోషించిన పాత్ర కోసం ఏపీ 24లో మరో సీనియర్ జర్నలిస్ట్ దర్శనం ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ప్రైమ్ 9 టీవీ చానెల్ లో ఉన్న జర్నలిస్ట్ సాయి తాజాగా అక్కడ రాజీనామా చేశారు. రేపటి నుంచి ఏపీ 24 కోసం ఆయన పనిచేయబోతున్నారు. దాంతో ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.