నారప్ప వస్తున్నాడు – అఫీషియల్

అభిమానులు ఎంతగా వద్దని కోరుకున్నా ఎట్టకేలకు నారప్ప ఓటిటి బాట పట్టేశాడు. ఈ వార్త గత పది రోజులుగా విపరీతంగా చక్కర్లు కొడుతున్నప్పటికీ కొద్ది నిమిషాల క్రితం అఫీషియల్ గా చెప్పేశారు. అతి త్వరలో థియేటర్లు తెరుచుకోబోతున్న తరుణంలో నిర్మాత సురేష్ బాబు తన నిర్ణయాన్ని మార్చుకుంటారేమో అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఎక్కువ ఆలస్యం లేకుండా ఈ నెల 20నే నారప్ప అమెజాన్ ప్రైమ్ ద్వారా నెట్లో సందడి చేయబోతున్నాడు. 2019 తమిళ్ లో వచ్చిన ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ అసురన్ రీమేక్ గా దీన్ని ప్రకటించినప్పటి నుంచి అంచనాలు ఇంకా పెరిగి పోయాయి. దానికి తోడు పోస్టర్లు కూడా హైప్ ని పెంచాయి

ఇటీవలే తెలంగాణ ఫిలిం ఛాంబర్ మీటింగ్ పెట్టి మరీ నిర్మాతలను తమ సినిమాలను అక్టోబర్ దాకా ఓటిటికి ఇవ్వొద్దంటూ చెప్పిన అతి కొద్దిరోజులకే ఈ ప్రకటన రావడం గమనార్హం. నిజానికి ముందు అనుకున్న డేట్ 24 లేదా 26. కానీ దాని కన్నా ముందే ఇంత త్వరగా వేయడం ఎవరూ ఊహించనిది. అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎంత వేడుకున్నా, నిరసనను వ్యక్తం చేసినా నిర్మాత సురేష్ బాబు వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ముందుగానే ప్రైమ్ తో చేసుకున్న ఒప్పందం మేరకు నారప్పను నేరుగా ప్రేక్షకుల ఇళ్లలోకి పంపించబోతున్నాడు. ఇది వెంకీ అభిమానులకు స్వీట్ కం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి

ఇప్పుడీ పరిణామం మరికొందరు నిర్మాతలను ప్రేరేపించడం ఖాయం. వెంకటేష్ లాంటి పెద్ద హీరో , సురేష్ లాంటి ఎంతో అనుభవం ఉన్న నిర్మాత, మణిశర్మ లాంటి టెక్నీషియన్స్ బ్యాక్ అప్ ఇంత సెటప్ ఉన్నా ఇలా ఓటిటి బాట పట్టారంటే థియేటర్లు ఇప్పట్లో తెరవరనే సంకేతంగానే దీన్ని తీసుకోవాలని పరిశీలకులు అంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత వెంకీ నటించిన ఊర మాస్ సబ్జెక్టు నారప్ప ఇలా ఇంట్లోనే చూడాల్సి రావడం అభిమానులను బాధ కలిగించేదే అయినా బిజినెస్ కోణంలో ఆలోచిస్తే సురేష్ బాబుకి ఇంతకన్నా వేరే ఆప్షన్ లేకపోయి ఉండొచ్చు. చూడాలి దీని మీద ఎలాంటి స్పందనలు వస్తాయో

Show comments